Revanth Reddy : టీఆర్ఎస్-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు, కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే అరెస్టులు : రేవంత్ రెడ్డి
Congress Protests on Power Charges Hike : రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. విద్యుత్ సౌధ ముందు రేవంత్ రెడ్డి, పలువురు నేతలు బైఠాయించి ఆందోళన చేశారు.
Congress Protests on Power Charges Hike : కేంద్రం ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మండిపడ్డారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ప్రజల సొమ్మును దోచేస్తు్న్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. విద్యుత్ సౌధ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు కార్యాలయంలోకి వెళ్తుండగా రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
ప్రజలే నా ధైర్యం - పోరాటమే నా ఊపిరి…
— Revanth Reddy (@revanth_anumula) April 7, 2022
ఎన్ని నిర్భందాలు విధించినా,ఎంతగా అణచివేసినా ప్రజల కోసం,వాళ్ల సమస్యల పరిష్కారం కోసం పదునెక్కిన పోరాటాలు నిర్మించడం నా నైజం. విద్యుత్ ఛార్జీల పెంపు,గ్యాస్ - డీజిల్ - పెట్రోల్ ధరల ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే దుర్మార్గపు నిర్ణయాలు. 1/2 pic.twitter.com/wcSRtMvSe5
కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేస్తుంటే అరెస్టులా?
అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరకీ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఆరోపిస్తున్న సీఎం కేసీఆర్, రైతులకు మద్దతుగా కేంద్రం తీరుపై నిరసన తెలిపితే కాంగ్రెస్ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన చేస్తుంటే మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పబ్‌ల ముందు తెలిపిన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి ఇప్పటి వరకు విడుదల చేయలని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నిరసన తెలిపినా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.
మిల్లర్లతో కుమ్మక్కైయ్యారు
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ నేతల్ని అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కు అయిందని ఆరోపించారు. వడ్లు కొనుగోలుపై టీఆర్ఎస్ బీజేపీ నాటకాలు ఆడుతున్నాయన్నారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నుంచి పలువురు నేతలతో ర్యాలీగా విద్యుత్ సౌధ ముట్టడికి కదిలారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఈ నిరసనలో పాల్గొన్నారు. విద్యుత్ సౌధ ముందు రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. అనంతరం రేవంత్ రెడ్డితో సహా 8 మందిని పోలీసులు విద్యుత్ సౌధలోకి అనుమతించారు. వీరు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావును కలిసి వినతి పత్రం అందించారు.