(Source: ECI/ABP News/ABP Majha)
HYDRA: నగరంలో 'హైడ్రా' దూకుడు - గగన్ పహాడ్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
Hyderabad News: నగరంలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. చెరువులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. తాజాగా గగన్ పహాడ్‌లో అక్రమ నిర్మాణాలను తొలగించారు.
HYDRA Demolitions In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో అక్రమ నిర్మాణాలపై 'హైడ్రా' (HYDRA) కొరడా ఝళిపిస్తోంది. శనివారం ఉదయం గగన్ పహాడ్‌లో (Gaganpahad) అక్రమ కట్టడాలను కూల్చేశారు. గతంలో పలుమార్లు నోటీసులిచ్చినా పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. భారీ బందోబస్తు మధ్య అప్పా చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించారు. కూల్చివేతల సమయంలో ఎవరినీ అనుమతించలేదు. చెరువు మొత్తం విస్తీర్ణం 34 ఎకరాలు కాగా.. ఇందులో 3 ఎకరాలు కబ్జా చేసి గోడౌన్లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 15 ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా యంత్రాంగం తొలగిస్తోంది. మొత్తం 13 అక్రమ నిర్మాణాలు గుర్తించిన అధికారులు.. ఇప్పటివరకూ 2 రెండు నిర్మాణాలను కూల్చేశారు. భారీ వర్షంలోనూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు, అమీన్ పూర్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం పర్యటించి పలు చెరువులను పరిశీలించనున్నారు. వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించనున్నారు. ఈ క్రమంలో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కబ్జాలపై ఉక్కుపాదం
మొన్న కన్వెన్షన్, నిన్న రాంనగర్, నేడు గగన్ పహాడ్.. ఇలా నగరంలో చెరువుల కబ్జాలు, ఎఫ్‌టీఎల్ పరిధుల్లో అక్రమ కట్టడాలపై 'హైడ్రా' ఉక్కుపాదం మోపుతోంది. పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులకు సంబంధించి అక్రమ నిర్మాణాలకు హైడ్రా అధికారులు నోటీసులిచ్చి అనంతరం చర్యలు చేపడుతున్నారు. అక్రమ కట్టడాలపై స్థానికుల ఫిర్యాదుపైనా వెంటనే స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్ (Ram Nagar) చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను 'హైడ్రా' అధికారులు శుక్రవారం కూల్చేశారు. కమిషనర్ రంగనాథ్ 2 రోజుల క్రితం వీటిని పరిశీలించగా.. ఆయన ఆదేశాలతో వచ్చిన నివేదిక మేరకు చర్యలు చేపట్టారు.
నగరంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చేస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే 18 నిర్మాణాలను కూల్చి 43 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే, కొన్ని చోట్ల తమకు నోటీసులు ఇవ్వకుండానే అధికారులు భవనాలు కూల్చేస్తున్నారని అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుమతులు తీసుకునే భవనాన్ని నిర్మించామని అయినా నోటీసులు ఇచ్చి కూల్చేస్తున్నారని పేర్కొంటున్నారు. మరోవైపు, చెరువులు, కుంటలు, బఫర్ జోన్ పరిధుల్లో నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపైనా హైడ్రా చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసుల నమోదుకు సైబరాబాద్ సీపీకి 'హైడ్రా' సిఫార్సు చేసింది.
రోజుకు 100 ఫిర్యాదులు
'హైడ్రా' (Hyderabad Disaster Management And Asset Protection)కు రోజుకు దాదాపు 100 ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ప్రత్యేక చట్టం వస్తే హైడ్రా పేరుతోనే నేరుగా నోటీసులు వస్తాయని.. ప్రస్తుతం ఆయా స్థానిక సంస్థలు నోటీసులు ఇస్తున్నాయని చెప్పారు. హైడ్రాలో చెరువుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ, క్రీడా మైదానాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ ఇలా పలు విభాగాలు ఏర్పాటు చేస్తామని.. నేరుగా ప్రజలు హైడ్రా పోలీస్ స్టేషన్‌లోనే ఆక్రమణలపై ఫిర్యాదు చేసేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో 72 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Also Read: Hyderabad News: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్ - 48 గంటలపాటు కుంభవృష్టి- ఉప్పొంగనున్న మూసీ నది!