YS Sharmila Complaint: వైఎస్ షర్మిలపై అసభ్య పోస్టులు, వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు
Sharmila News: సోషల్ మీడియాలో కొంత మంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నీచంగా పోస్టులు చేస్తున్నారని షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు.
YS Sharmila complaints to Hyderabad Cyber Crime: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో కొంత మంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నీచంగా పోస్టులు చేస్తున్నారని షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు. తద్వారా తనను తీవ్ర అప్రతిష్ఠ పాలు చేయాలని చూస్తున్నారని వైఎస్ షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో అధికార పక్షంపై విమర్శలు చేస్తున్న తనపై పోస్టులు చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయని అన్నారు. తనపై దురుద్దేశంతో.. భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. షర్మిల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
షర్మిల ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. తాను ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనపై దుష్ర్పచారం ఎక్కువైంది. ఏపీ ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసినప్పటి నుంచి అధికార పార్టీకి చెందిన కొందరు తనపై కక్ష పెంచుకున్నారు. దురుద్దేశంతో సోషల్ మీడియాలో తనపై, కుటుంబ సభ్యులపై అసభ్యంగా కామెంట్లు పెడుతున్నారు. అవన్నీ నిరాధారం. ఆ పోస్టులు నన్ను అవమానపర్చేలాగా ఉన్నాయి. ‘వైఎస్ షర్మిల ప్రాణాలకు ప్రమాదం.. దొంగల ముఠా.. వైఎస్ షర్మిల క్యాంపు కార్యాలయంలో కోవర్ట్ ఆపరేషన్’ అంటూ కొన్ని పీడీఎఫ్ కాపీలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కొంత మంది విదేశాల నుంచి కూడా తనపై అసభ్య పోస్టులు పెడుతున్నారని షర్మిల తెలిపారు. సత్యకుమార్ దాసరి(చెన్నై), రమేశ్ బులగాకుల, మేదరమెట్ల కిరణ్‌కుమార్, పంచ్ ప్రభాకర్(అమెరికా), ఆదిత్య(ఆస్ట్రేలియా), సేనాని, వర్రా రవీందర్‌రెడ్డి, శ్రీరెడ్డి, మహ్మద్ రెహ్మత్ పాషా లాంటి వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
షర్మిల తన అన్నతో విభేదించి వైఎస్‌ఆర్.. వైఎస్ జగన్‌కు ఆజన్మ శత్రువైన చంద్రబాబుతో చేతులు కలిపి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోందని ఇంకొంత మంది పోస్టులు పెడుతున్నారని షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు, పోస్టులతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చి, అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వీరిపై చర్యలు తీసుకోకపోతే తనకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని అన్నారు.