Viral News: రైల్వే ట్రాక్ మీద కారు నడిపిన యువతి, అడ్డుకున్న వారిపై చాకుతో బెదిరింపులు
Woman Driving on Train Tracks | వికారాబాద్ జిల్లాలో ఓ యువతి రైలు పట్టాలపై కారు నడుపుతూ హల్ చల్ చేసింది. లోకో పైలట్ ఆమెను గమనించి రైలును నిలిపివేశాడు. గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

శంకర్ పల్లి: పిచ్చి పరాకాష్టకు చేరితే ఇలాగే ఉంటుంది. ఓ యువతి ఎక్కడా చోటు లేదన్నట్లు రైలు పట్టాలపై కారు నడిపింది. ఆమె నిర్వాకం వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం తలెత్తింది. వికారాబాద్ జిల్లాలోని నాగులపల్లి, శంకర్ పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్ చల్ చేసింది. దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ఆమె కారు నడిపినట్లు సమచారం.
వారించిన వారిని చాకుతో బెదిరించిన కిలేడీ
రైలు పట్టాలపై యువతి కారు నడపటాన్ని గుర్తించిన కొందరు ఆమెను వారించారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఆమె ప్రాణాలుతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని స్థానికులు ఆమెను అడ్డగించగా.. చాకుతో వారిని బెదిరించింది. ఆ తరువాత రైలు లోకో పైలట్ గమనించి చివరి నిమిషంలో రైలును ఆపారు. యువతిని స్థానికులు పట్టుకున్నారు. ఆమె చేసిన పిచ్చి పనుల వల్ల దాదాపు 2 గంటలపాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
స్థానికులు యువతిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. శంకర్ పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను యూపీకి చెందిన సోనీగా గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసేదని కానీ ఈ మధ్యే ఆమె జాబ్ పోయినట్టు పోలీసులు తేల్చారు.
శంకర్ పల్లి నుంచి హైదరాబాద్ వైపుగా రైల్వే ట్రాక్ మీద ఆమె కారు నడిపిందని స్థానికులు చెబుతున్నారు. అయితే యువతి మానసిక పరిస్థితి సరిగ్గా ఉందా, లేక డ్రగ్స్ తీసుకుందా అని అనుమానిస్తున్నారు. పోలీసులు యువతి సోనిని వైద్య పరీక్షల కోసం చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






















