Whats App DP Fraud: వాట్సాప్ డీపీ పెట్టి టోకరా, స్పందించ వద్దన్న రఘుమా రెడ్డి!
Whats App DP Fraud: టీఎస్ఎస్ పీడీఎల్ ఛైర్మన్ రఘుమా రెడ్డి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని దుండగులు పలువురిని మోసం చేశారు. స్పందించిన రఘుమా రెడ్డి ఎలాంటి మెసేజ్ లు వచ్చినా స్పందించవద్దని తెలిపారు.
Whats App DP Fraud: ఆన్ లైన్ కేటుగాళ్లు రోజురోజుకూ రెచ్చి పోతున్నారు. వివిధ మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అధికారుల ఫోటోలు పెట్టి ఫ్రాడ్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ నేరగాళ్లు వాట్సాప్ ను కూడా తమ నేరాలకు వాడుకుంటున్నారు. తమ నంబరుకు పేరు ప్రఖ్యాతలు ఉన్న వారి ఫోటోలను డీపీలుగా పెట్టి డబ్బులు అడుగుతున్నారు. తెలిసే వారే కదా ఇస్తే ఇక అంతే సంగతులు.
వాట్సాప్ డీపీగా రఘుమారెడ్డి ఫోటో..
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి. రఘుమా రెడ్డి ఫొటోను ఒక ఆగంతకుడు వాట్సాప్ తన నంబరుకు వాట్సాప్ డీపీగా పెట్టుకున్నాడు. దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థలో పని చేసే ఇతర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఫోన్లు నంబర్లు సేకరించాడు. తర్వాత రఘుమా రెడ్డి పంపుతున్నట్లుగా.. వారికి మెసేజీలు పంపాడు. తనకు డబ్బు అవసరం ఉందని ఇప్పుడు పంపింతే తర్వాత పంపిస్తానని మెసేజీలు చేశాడు. కొందరు దీనిని గుర్తించి రఘుమా రెడ్డికి అసలు విషయం చెప్పగా ఆయన స్పందించారు.
ఫేక్ మెసేజీలకు స్పందించవద్దు, డబ్బులు ఇవ్వొద్దు..
రఘుమా రెడ్డి డీపీ గా ఉన్న వాట్సాప్ నంబరు నుండి మెసేజీలు వస్తే పట్టించుకోవద్దని, వాటిపై స్పందించవద్దని కోరారు రఘుమా రెడ్డి. ఆ మెసేజీలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆ నంబరు నుండి కానీ, వేరే నంబరు నుండి కానీ మెసేజీలు చేసి డబ్బులు అడిగితే ఇవ్వవద్దని సూచించారు. ఇతర ప్రయోజనాలు ఆశించి మెసేజీలు చేసినా.. స్పందించవద్దని అన్నారు. 'దయచేసి అలాంటి మెసేజీలకు స్పందించవద్దు, డబ్బు అడిగితే ఇవ్వకండి, ఇతర ప్రయోజనాలు ఆశించి మెసేజీలు పంపినా స్పందించకండి' అని రఘుమా రెడ్డి కోరారు.
ఈమధ్య కాలంలో పెరిగిన వాట్సాప్ నేరాలు..
వాట్సాప్ డీపీలు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రభుత్వ విభాగాల్లోని ఉన్నతాధికారుల ఫోటోల సంపాదించి వాటితోనే నేరాలు చేస్తున్నారు. తమ వాట్సాప్ నంబర్లకు అధికారులు ఫోటోలను డీపీలుగా పెట్టి నేరాలకు తెర తీస్తున్నారు. ఆయా విభాగాల అధికారులకు వారే పంపినట్లుగా మెసేజీలు పంపుతున్నారు. డబ్బులు అవసరం ఉందని, ఇప్పుడు ఇస్తే తర్వాత తిరిగిస్తానని చెబుతూ వాట్సాప్ లో మెసేజీలు పెడుతున్నారు. ఉన్నతాధికారి అడిగితే కాదనడం భావ్యం కాదని, తమకు ఎంత చేతనైతే అంత పంపుతున్నారు. ఉన్నతాధికారి కాబట్టి తిరిగి అడగలేరు. ఆయనెలాగూ తీసుకోలేదు కాబట్టి తిరిగి ఇవ్వడు. అలా ఈ మోసాలు జరుగుతున్నాయి.
గిఫ్ట్ కూపన్లు, వోచర్లు పేర్లతోనూ మోసాలు..
డబ్బు సందేశాలే కాకుండా ఇతర మార్గాల్లోనూ మోసాలు చేస్తున్నారు. అమెజానా గిఫ్ట్ కూపన్లు వచ్చాయని, ఫ్లిప్ కార్ట్ బహుమతిలో గెలుపొందారని మొదట నమ్మిస్తారు. నమ్మకం వచ్చిందని అనుకుంటే తమ ప్రతాపం చూపిస్తారు. ఆ గిఫ్ట్ కూపన్లు, వోచర్లు పంపించాలంటే ప్యాకేజింగ్ కు, పోస్టుకు కొంత డబ్బు అవసరం ఉంటుందని, అవి పంపితే మీకు గిఫ్ట్ పంపిస్తామని చెబుతారు. అలా డబ్బు పంపగానే, మరో కారణం చెప్పి మరికొంత పంపమంటారు. అలా ఉంటున్నాయి నేరాలు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.