(Source: ECI/ABP News/ABP Majha)
రాజీనామా లేఖ జేబులో పెట్టుకొని వస్తారా? KCR వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
దేశ స్థితిగతులు, ప్రధాని మోదీ పని తీరు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో మాట్లాడుతూ.. ఆ వివరాలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరిన సంగతి తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున (ఫిబ్రవరి 12) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీపైన చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దేశ ఆర్థిక స్థితిగతులు, ప్రధాని మోదీ పని తీరు తదితర అంశాలపై వివిధ లెక్కలతో సహా ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో వివరించారు. ఆ వివరాలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరిన సంగతి తెలిసిందే. దానిపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ చర్చను ప్రెస్ క్లబ్ లో పెడతావా, అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరవీరు స్తూపం వద్ద పెట్టుకుందామా? ప్రగతి భవన్ లేదా ఫాంహౌజ్ లో పెడతావా అంటూ సవాలు విసిరారు. వచ్చేటప్పుడు రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని తీసుకురావాలని అన్నారు. అయినా, ఎన్నికల తర్వాత ఎలాగూ రాజీనామా చేయాల్సి వస్తుందని అన్నారు.
2014లో తెలంగాణ అప్పు రూ.60 వేల కోట్లుగా ఉందని, ఇప్పుడు ఏకంగా రూ.5 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. అసెంబ్లీలో అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణలు చేసిన సీఎం కేసీఆర్.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి మాత్రం మాట్లాడలేదని అన్నారు.