Customer locked: బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం - రాత్రంతా లాకర్ రూములో 85 ఏళ్ల వృద్ధుడు ! ఉదయం అంతా షాక్
Union Bank Customer: పని మీద బ్యాంకుకు వెళ్లిన పెద్దాయన రాత్రంతా బ్యాంకులోనే ఉండిపోవాల్సి వచ్చింది. తెల్లవారి సిబ్బంది తాళాలు తెరవడంతో అసలు విషయం బయటపడింది.
Union Bank Customer Locked Whole Night In Bank: పని మీద బ్యాంకుకు వెళ్లిన ఓ కస్టమర్ రాత్రంతా బ్యాంకులో బంధీ అయిపోయారు. బ్యాంకు నుంచి బయటపడే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకులో చిక్కుకుపోయిన వ్యక్తి 85 ఏళ్ల వయసు వారు కావడంతో కుటుంబసభ్యులు ఆయన ఏమైపోయారోనని ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్‌లో జరిగింది.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 67లో కృష్ణారెడ్డి నివాసం ఉంటున్నారు. కృష్ణారెడ్డి అనే వృద్దుడికి జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. పని మీద సోమవారం సాయంత్రం తన బ్రాంచ్ యూనియన్ బ్యాంక్‌కు వెళ్లారు. లాకర్ గదిలోకి వెళ్లిన ఆయన తన పనిలో ఉండగా లాకర్ అధికారులు చెక్ చేసుకోకుండా లాక్ చేసుకుని వెళ్లిపోయారు. బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఆ పెద్దాయన రాత్రంతా బ్యాంకులోనే బంధీగా ఉండిపోయారు. దాదాపు 18 గంటలపాటు ఆయన బ్యాంకులో తిండి, నీరు లేకుండా గడపాల్సి రావడంతో ఎంతో ఇబ్బంది పడ్డారు.
తెల్లవారాక కానీ గుర్తించని సిబ్బంది..
మంగళవారం ఉదయం యూనియన్ బ్యాంక్ తెరిచాక తమ తప్పిదం ఏంటో బ్యాంకు ఉద్యోగులు గుర్తించారు. లాకర్ రూములోకి వెళ్లిన వృద్దుడు తమ నిర్లక్ష్యం కారణంగా రాత్రంతా బ్యాంక్ లాకర్ రూములో ఉండిపోవాల్సి వచ్చింది. తెల్లవారిన తర్వాత బ్యాంక్ సిబ్బంది గమనించగా.. వృద్దుడు కృష్ణారెడ్డి స్పృహతప్పి పడిపోయి ఉన్నారు. ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
కుటుంబసభ్యుల ఆందోళన..
ఇంటి నుంచి బయటకు వెళ్లిన కృష్ణారెడ్డి రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. చుట్టుపక్కల ఆరా తీసినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం బ్యాంకు సిబ్బంది అసలు విషయాన్ని తెలిపడంతో ఆశ్చర్యపోవడం కుటుంబసభ్యుల వంతయింది.
బ్యాంకు అధికారులు రియాక్షన్ ఇదే..
దేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు మద్దతు తెలిపి అందులో పాల్గొన్నారు. దాంతో రెగ్యూలర్ స్టాఫ్ కాకుండా వేరే స్టాఫ్ పని చేస్తున్నారు. తాత్కాలిక స్టాఫ్ చెక్ చేయకుండా లాకర్ రూమ్ కు తాళాలు వేసి వెళ్లిపోయారని ఓ బ్యాంకు ఉన్నతోద్యోగి చెప్పారు. అయితే బ్యాంకులో రాత్రంతా ఉండిపోయిన కస్టమర్ స్పృహతప్పి పడిపోయి ఉండటం అనేది నిర్ధారించలేం అన్నారు. ప్రస్తుతం కస్టమర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఏ ప్రమాదం లేదని చెప్పారు.
Also Read: Journalist Rana Ayyub: జర్నలిస్టు రానా ఆయుబ్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు - ముంబయి ఎయిర్‌పోర్టులో అడ్డగింత
Also Read: CRPF Camp: షాకింగ్ ! సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై పెట్రో బాంబులతో మహిళ దాడి, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది