TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం
TSPSC Paper Leakage: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లేకీజీ కేసులో తాజాగా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నిందితుల సంఖ్య 15కు చేరుకుంది.
TSPSC Paper Leakage: రాష్ట్రంలో కొన్ని రోజులుగా కలకలం రేపుతున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ కేసులో తాజాగా తిరుపతి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు చెప్పారు. దీంతో అరెస్ట్ చేసిన నిందితుల సంఖ్య 15కు చేరుకున్నట్లు తెలిపారు. తిరుపతి ప్రధాన నిందితురాలు రేణుక భర్త డాక్వా ద్వారా ఏఈ ప్ర్నాపత్రం పొందినట్లు అధికారులు గుర్తించారు. ప్రశాంత్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ ను రాజశేఖర్ ద్వారా పొందాడు. దీంతో తాను న్యూజిలాండ్ నుంచి వచ్చి పరీక్ష రాశాడు. అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సిట్ పేర్కొంది. టీఎస్పీఎస్సీ మరో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ ఇంట్లో అధికారులు రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రవీణ్ ఇంట్లో సోదాలు జరపగా... శంకర లక్ష్మీ డైరీ నుంచి పాస్ వర్డ్ చోరీ చేసినట్లు అధికారులు నిర్ధారణ చేశారు. దీంతో కంప్యూటర్ లో ఉన్న ప్రశ్నాపత్రాలు సమాచారాన్ని చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు.
ఇంతకుముందే 14 మందిని అరెస్ట్ చేసిన అధికారులు..
ఈ కేసును అధికారులు విచారణ చేసినప్పటి నుంచి రోజుకో కొత్త విషయం బయటకి వస్తుంది. నిందితులు ఒకరి తర్వాత ఒకరు బయట పడుతున్నారు. చివరకి ఈ కేసులో ఎంత మంది ఉన్నారో తెలియాల్సి ఉంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు ఇంతకు ముందు 14 మందిని అరెస్ట్ చేశారు. ఏఈ, సివిల్ ప్రశ్నా పత్రం కొనుగోలు చేసినట్లు ఆధారాలు దొరకడంతో మహబూబ్ నగర్ జిల్లా ఫరూక్ నగర్ మండలంకి చెందిన రాజేందర్ కుమార్ ను సిట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాజేందర్ కుమార్.. మహబూబ్ నగర్ జిల్లా గుండేడులో ఉపాధి హామీ పథకం క్వాలిటీ కంట్రోలర్ గా పని చేసేవాడు. దిల్ సుఖ్ నగర్ లోని కోచింగ్ సెంటర్ లో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నప్పుడు డాక్వా నాయక్, తిరుపతయ్య పరిచయం అయ్యారు.
వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ..
ఈ కేసులో నిందితులుగా ఎవరు ఉన్న వదిలేది లేదని అధికార పార్టీ నాయకులు పలువురు తెలిపారు. రద్దు చేసిన పరీక్షలన్నీ త్వరలోనే నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందవద్దని.. వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు పెడతామని పేర్కొంది.