Telangana: మద్యం ఆదాయానికి గండి కొడితే నిఘాపెట్టి కఠిన చర్యలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
Telangana Liquor Shops Lisence: మద్యం దుకాణాల లైసెన్సుకు ఎక్సైజ్ శాఖ ఇదివరకే నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
Telangana Liquor Shops Lisence:
తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా జరగాలని, అందరికీ అవకాశాలు కల్పించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణ లో ఎవరైనా సిండికేట్ గా ఏర్పడిన, ఎవరైనా దరఖాస్తులు సమర్పించకుండా అడ్డంకులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారికి, సహకరించే వారిపై గట్టి నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణ పారదర్శకంగా జరగాలని, ఎవరైనా సిండికేట్ అయి అప్లికేషన్లు రాకుండా చేయడం లాంటివి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు. గతంలో రెండు బ్యాంకుల గ్యారెంటీలు ఇవ్వాల్సి ఉండగా, 2021 నుంచి ఒకటే గ్యారెంటీ తీసుకుంటున్నారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తుదారులకు సమాచారం కావాలన్నా వెంటనే స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. లేకపోతే వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2523 లో సంప్రదించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ, జాయింట్ కమిషనర్ kAB శాస్త్రి, డిప్యూటీ కమిషనర్లు డేవిడ్ రవికాంత్, హరికిషన్, సహాయ కమిషనర్ లు ఎ. చంద్రయ్య గౌడ్, శ్రీనివాస్, ఈఎస్ లు ఏ. సత్యనారాయణ, టి. రవీందర్ రావు, అరుణ్ కుమార్, విజయ భాస్కర్ గౌడ్, విజయ్, పవన్ కుమార్, TSBCL ఉన్నతాధికారులు సంతోష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
డ్రా పద్ధతి ద్వారా లైసెన్సులు: ఎక్సైజ్ శాఖ
2023 నుంచి 25 వరకు రెండేళ్ల కాలపరిమితితో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకీ తెలంగాణ సర్కారు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పాత విధానం ద్వారానే మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వనున్నారు. దరఖాస్తు ఫీజు, లైసెన్సు ఫీజులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ నెల 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టు 20, 21వ తేదీల్లో లాటరీని నిర్వహించి.. డ్రా పద్ధతి ద్వారా దుకాణాలకు లైసెన్సులు ఇవ్వనున్నారు. మద్యం దుకాణాల సంఖ్య, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కూడా ఒకే విధంగా ఉండటంతో అబ్కారీ శాఖ గత రెండేళ్లుగా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది.
మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 నుంచి మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేస్తోంది. గౌడ, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడ్ వర్గానికి 15 శాతం(363), ఎస్సీలకు 10 శాతం (262), ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకారం షాపులు కేటాయించారు. మద్యం దుకాణాలను స్థానికులకే కేటాయిస్తూ వస్తున్నారు. 1864 షాపులను ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. గౌడ, ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మద్యం షాపులకు రిజర్వేషన్లు(Reservations) అమలు చేస్తున్నారు.