TS Minister Gangula: దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ - ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనుల్ని సహించం: మంత్రి గంగుల
TS Minister Gangula Kamalakar: సీఎంఆర్ డెలివరీ త్వరగా పూర్తి చేయడంతో పాటు రాబోయే కొత్త పంట వచ్చే సమయానికి రైస్ మిల్లులు, గోదాములను ఖాళీ చేయాలని ఆదేశించారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.
TS Minister Gangula Kamalakar: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల మేరకు రైతులకు, పేదలకు సేవలు చేస్తున్నది పౌరసరఫరాల సంస్థ అన్నారు ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్. 33 జిల్లాల డీఎంలు, ఉద్యోగులతో సోమవారం హైదరాబాద్ లోని కార్పోరేషన్ భవన్లో సమావేశమయ్యారు, ఉద్యోగుల డైరీని ఆవిష్కరించి, వారికి హెల్త్ కార్డులను అందజేసారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ.. సీఎంఆర్ డెలివరీ త్వరగా పూర్తి చేయడంతో పాటు రాబోయే కొత్త పంట వచ్చే సమయానికి రైస్ మిల్లులు, గోదాములను ఖాళీ చేయాలని ఆదేశించారు. డిఫార్మెంట్ లోని ప్రతీ ఉద్యోగి నిరంతరం అప్రమత్తంగా ఉండి రైతులకు సేవలందించాలన్నారు,
దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ..
తెలంగాణ ధాన్యం సేకరణలో దేశానికే రోల్ మాడల్గా నిలిచిందన్న గంగుల, గతంలో 25 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1 కోటి 41 లక్షల మెట్రిక్ టన్నులకు సేకరణని పెంచామన్నారు. కరోనా సమయంలో భయటకు రావడానికే భయపడుతుంటే పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులు రికార్డు స్థాయి యాసంగి ధాన్యం 92 లక్షల మెట్రిక్ టన్నులను రైతుల ముంగిటకే వెల్లి సేకరించామన్నారు. ఎవరూ ముందుకురాని పరిస్థితుల్లో ప్రత్యేకంగా మానవ వనరుల్ని సమకూర్చుకొని మూడు గ్యాస్ కంపెనీలతో నిరంతరాయంగా మూడు షిప్టుల్లో పనిచేసి ఏ ఒక్క ఇంట్లోనూ గ్యాస్ కొరత రాకుండా చూసుకున్నామన్నారు.
ప్రభుత్వం ఏ పని చేసినా రైతు సంక్షేమంతో కూడుకొని ఉంటుందని, అదే దృష్టితో పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులు రైతుల కోసం, పేదల కోసం పనిచేయాలన్నారు. ఇటు రైతుల పంటను సేకరిస్తూ దాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి పేదలకు రేషన్ ద్వారా పంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న సివిల్ సప్లైస్ ఉద్యోగులు మద్యతరగతి వాడుకునే వినియోగ వస్తువుల బ్లాక్ మార్కెట్ని అరికట్టి, ధరల స్థిరీకరణలో ఘనమైన పాత్ర పోషిస్తున్నారన్నారు.
3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్పోరేషన్ ఎంప్లాయిస్ కోరుతున్న రీతిలో వారికి ఆరోగ్య భద్రతను కల్పించేందుకు 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ని గత సంవత్సరం డిసెంబర్ నుండి ప్రారంభించామని వాటికి సంబందించిన డిజటల్ కార్డులను ఉద్యోగులకు అందించారు. కార్పోరేషన్లోని 244 మంది ఉద్యోగులకు వారి కుటుంభ సభ్యులకు ప్రభుత్వ బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ ద్వారా క్యాష్ లెస్ వైద్య సేవల్ని ప్రారంభించామన్నారు మంత్రి గంగుల.
గత యాసంగిలో కేంద్రం తీరుతో ధాన్యం సేకరణలో ఎంతో ఇబ్బంది పడ్డామని, నేడు బాయిల్డ్ నిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం పునరాలోచన చేయాలని, రైతులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం సేకరణకు అనుమతి ఇవ్వాలని కేంద్రంతో మాట్లాడతానన్నారు. సీఎం కేసీఆర్ నేత్రుత్వంలో త్వరలోనే రాబోయే యాసంగి ధాన్యం సేకరణకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు మంత్రి గంగుల. ప్రభుత్వ లక్ష్యం మేరకు రైతులకు అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, మిల్లర్లతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యవహరించాలని సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఉద్యోగులకు సూచించారు మంత్రి.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి అంశాన్ని ఉపేక్షించేది లేదని, ప్రభుత్వం దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం, ఉద్యోగులు కలసి రాష్ట్ర ప్రజలకు రైతులకు, పేదలకు నాణ్యమైన సేవల్ని అందించాలని పిలుపునిచ్చారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, ఉద్యోగుల సంఘం నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.