TRS On Congress: గాంధీ భవన్ కాదది కుస్తీ భవన్- కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్ విసుర్లు
తెలంగాణలో ధాన్యం పంచాయితీలో కాంగ్రెస్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. రాహుల్ చేసిన ట్వీట్, ఆ తర్వాత పరిణామాలపై టీఆర్‌ఎస్ మండిపడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలుగా అభివర్ణిస్తోంది.
తెలంగాణ(Telangana) రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన ధాన్యాన్ని కేంద్రం మెడలు వంచి అయినా సరే కొనుగోలు చేయిస్తామన్నారు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prasanth Reddy). ఉగాది పండుగ తర్వాత కేంద్రంపై పోరుబాటకు శ్రీకారం చుడతామన్నారు. మంగళవారం కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మొండి వైఖరిని అవలంభిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో అన్నదాతలు సాగు చేసిన వరి పంటను కేంద్రం కొనుగోలు చేయాల్సి ఉండగా, లేనిపోని కొర్రీలు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం తన గురుతర బాధ్యతను విస్మరిస్తూ కేవలం ఓ వ్యాపారి తరహాలో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు ప్రశాంత్ రెడ్డి. సహచర మంత్రులతో కలిసి తాను దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిస్తే తెలంగాణ ప్రజలను అవహేళన చేసే రీతిలో మాట్లాడారని ఆక్షేపించారు. పంజాబ్ తరహాలోనే తెలంగాణలో రైతులు సాగుచేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తాము కోరితే, అందుకు కేంద్రం నిరాకరిస్తూ వివక్ష పూరిత ధోరణి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. యాసంగిలో సాగుచేసిన ధాన్యాన్ని పట్టిస్తే నూకలు ఎక్కువగా వస్తాయని, ఇదే విషయాన్ని పీయూష్ గోయల్ కు వివరించామన్నారు. ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయించాలని చెప్పడం పీయూష్ అహంకారాన్ని చాటిందన్నారు. ఆరు నూరైనా కేంద్రంతోనే ధాన్యం కొనుగోలు చేయించి తీరుతామని, అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాడుతామన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
తెలంగాణ బిజెపి(Telangana BJP) అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) కు చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి తన వాగ్దానాన్ని నిలుపుకోవాలని సూచించారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయిస్తే బండి సంజయ్ కు తాము సహకరిస్తామన్నారు. అప్పటి వరకు బీజేపీని, ఆ పార్టీ నాయకులను నమ్మే పరిస్థితి ఎంత మాత్రం లేదన్నారు. వారి నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాన్సెన్స్. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) న్యూసెన్స్ అని అన్నారు టీఆర్‌ఎస్(TRS) ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy). తెలంగాణ రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని పార్లమెంటులో ప్రధాని మోదీని ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. రాహుల్, రేవంత్ ఇద్దరు కూడా ఐరన్ లెగ్‌లుగా అభివర్ణించారాయన. వీళ్లు ఎక్కడ కాలుపెడితే అక్కడ నాశనమేనన్నారు.
బీజేపీలో ట్రిబుల్ ఆర్ ఉన్నట్లే కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రూపంలో డబుల్ ఆర్ ఉందన్నారు జీవన్ రెడ్డి. వీళ్లు ప్రజలకు ట్రబుల్ అని, దేశానికి దరిద్రమన్నారు. రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి పోయినా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి కారణంగానే టీడీపీ ఆఫీస్‌కు తాళం పడిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో కాలుపెట్టిన వెంటనే హుజూరాబాద్‌లో డిపాజిట్ కోల్పోయిందన్నారు. గాంధీ భవన్ కాస్త కుస్తీ భవన్ గా మార్చారని ఎద్దేవా చేశారు.