Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లోకి ఆగంతుకుడు, ఎత్తైన ప్రహరీ దూకేసి చొరబడ్డ యువకుడు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్డు నం.81లో మహేష్ బాబు నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన నివాస ప్రాంగణంలో ప్రహరీ గోడ పక్కనే పెద్ద శబ్దం వచ్చింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నివాస ప్రాంగణంలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం కలకలం రేపింది. బుధవారం మహేశ్ ఇంటి ప్రహరీ గోడ ఎక్కి ఓ ఆగంతుకుడు లోనికి దూకాడు. ఆ ప్రహరీ గోడ చాలా ఎత్తుగా ఉండడంతో అంత ఎత్తు నుంచి దూకిన ఆ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇంటికి సెక్యూరిటీగా ఉన్న గార్డులు అతణ్ని గమనించి అతన్ని కాపలాదారులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను నడవలేని స్థితిలో ఉన్నట్లుగా సిబ్బంది తెలిపారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్డు నం.81లో మహేష్ బాబు నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన నివాస ప్రాంగణంలో ప్రహరీ గోడ పక్కనే పెద్ద శబ్దం వచ్చింది. సెక్యురిటీ గార్డులు వెళ్లి చూసి ఓ వ్యక్తి గాయాలపాలై పడి ఉండటం గుర్తించారు. వెంటనే అతన్ని పట్టుకొని విచారించడంతోపాటు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. అతణ్ని విచారణ చేయగా మూడు రోజుల కిందట ఒడిశా నుంచి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. సమీపంలో ఉన్న ఒక నర్సరీ వద్ద ఉంటున్నట్లుగా చెప్పాడు. తాను దొంగతనం కోసం వచ్చినట్లుగా చెప్పాడు. అందులో భాగంగానే తాను 30 అడుగుల గోడ పైనుంచి దూకానని అన్నాడు.
పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుణ్ని కృష్ణ అనే 30 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. అతను ఎత్తైన ప్రహరీ గోడ పై నుంచి దూకడంతో గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో మహేష్ బాబు ఇంట్లో లేరు. సెక్యురిటీ గార్డుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.
తల్లి మరణంతో విషాదంలో కుటుంబం
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి నిన్న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వయసు పెరగడంతో పాటు వచ్చిన అనారోగ్య సమస్యలు ఆమె మరణానికి కారణం అని తెలుస్తోంది. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
ఇందిరా దేవికి కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. అందువల్ల, ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. సుమారు నెల రోజుల నుంచి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి మహేష్, ఇతర కుటుంబ సభ్యులు తెలుసుకుంటూ ఉన్నారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ నిన్న ఉదయం ఇందిరా దేవి కన్నుమూశారు.
ముగిసిన అంత్యక్రియలు
ప్రముఖులు, ప్రేక్షకుల సందర్శనార్థం బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పద్మాలయ స్టూడియోస్‌లో ఇందిరా దేవి పార్థీవ దేహాన్ని ఉంచారు. ఆమెకు మోహన్ బాబు, మురళీ మోహన్, రాఘవేంద్రరావు, బి. గోపాల్, అక్కినేని నాగార్జున, వెంకటేష్, రానా దగ్గుబాటి సహా పలువురు సినిమా ప్రముఖులు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సహా పలువురు రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు.