Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు అక్కర్లేదు.. ఈడీకి సహకరించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. రేవంత్ పిటిషన్ విచారించిన న్యాయస్థానం... ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు సహకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తునకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. డ్రగ్స్ కేసుపై 2017లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్డు కీలక వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో వేసిన పిటిషన్ విచారణ టైంలో ఈడీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని పిటీషనర్ తరుపు న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు వివరించారు. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసులో తెలంగాణ ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదని తెలిపారు.
ఆన్‌లైన్ విచారణ ద్వారా డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను నేరుగా కోర్టుకు వివరించారు ఈడీ జేడీ అభిషేక్ గోయల్. డ్రగ్స్ కేసులో డాక్యు మెంట్లు, వివరాలు ప్రభుత్వం ఇవ్వడంలేదని కోర్టుకు వివరించారు.
తమ వద్ద ఉన్న సమాచారమంతా ఈడీకి, కోర్టుకు ఇచ్చామని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఎక్కడా ఎలాంటి సమాచార లోపం లేదని తెలిపారు.
అన్ని వర్గాల తరఫున వాదనలు పూర్తిగా విన్న హైకోర్టు ఎఫ్‌ఐఆర్, ఇతర పూర్తి వివరాలు ఈడీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తుకు సమర్పించాల్సిన రికార్డులన్నీ
ఈడీ దరఖాస్తు చేసి 15రోజుల వ్యవధిలోపు ఇవ్వాలని తెలిపింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన కాల్ డేటా రికార్టులను నెల రోజుల్లోపు ఈడీకి ఇవ్వాలని ఆదేశించింది.
డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి పిల్‌పై విచారణ ముగించిన హైకోర్టు... ఈ కేసును సిబిఐ లేదా ఇతర దర్యాప్తు సంస్దలకు అప్పగించాల్సిన అవసరం లేదని తెలిపింది. తమ ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది.
ఒక వేళ ప్రభుత్వం వివరాలు సమర్పించకపోతే తమను సంప్రదించవచ్చని ఈడీకి హైకోర్టు సూచించింది. మాదకద్రవ్యాలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్న హైకోర్టు, దేశ ప్రయోజనాల కోసం ఈడీ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది.