RTC Strike in Hyderabad: వెనక్కి తగ్గని ఆర్టీసీ కార్మికులు.. హైదరాబాద్ వ్యాప్తంగా బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు!
ప్రభుత్వంతో యూనియన్ చర్చలు విఫలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో తెలంగాణ వ్యాప్తంగా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సెగ: స్తంభించిన రవాణా, డిపోల వద్ద కార్మికుల నిరసన
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వం నియమించిన కమిటీతో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ (JAC) జరిపిన చర్చలు విఫలం కావడంతో, హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ వంటి ప్రధాన బస్టాండ్లలో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఎల్బీనగర్ వంటి రద్దీ ప్రాంతాలలో ప్రయాణికులు గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్సులు లేకపోవడంతో మెట్రో స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది.
ముఖ్యంగా నాగోల్, బండ్లగూడ, జీడిమెట్ల డిపోల వద్ద సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జీడిమెట్ల డిపోలో మొదటి షిఫ్ట్‌లో 132 బస్సులు ఉండగా, భారీ పోలీస్ బందోబస్తు మధ్య కేవలం 3 బస్సులను మాత్రమే ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో బయటకు పంపగలిగారు. డిపోల వద్ద కార్మికులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, 2021, 2025 పేస్కేళ్లను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, రవాణా, ఆర్థిక మంత్రులు ఈ విషయంలో తక్షణమే చొరవ చూపాలని జేఏసీ కో-కన్వీనర్ కత్తుల యాదయ్య డిమాండ్ చేశారు.
మరోవైపు, బస్సులు నడవకపోవడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆటో డ్రైవర్లు అదను చూసి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. కొన్నిచోట్ల అతి తక్కువ సంఖ్యలో నడుస్తున్న బస్సుల్లో జనం కిక్కిరిసి ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. జీడిమెట్ల డిపో వద్ద జరిగిన ధర్నాలో జేఏసీ నాయకులు ఎం.రాజు, గోవర్ధన్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొని, తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఆర్టీసీ యూనియన్ నాయకులు చక్రవర్తి మాట్లాడుతూ.. ‘ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలుకావడంతో జూబ్లీ బస్ స్టేషన్ లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కంటోన్మెంట్, పికెట్ డిపోలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉత్తర తెలంగాణ కు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలను త్వరగా తీర్చాలని’ కోరారు .
మహాలక్ష్మి పథకం విజయవంతం కావడానికి ఆర్టీసీ కార్మికులే కారణమని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీలో పని చేసే వారికి పిఆర్సి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదని ఇదే విషయమే పలుమార్లు అధికారులతో చర్చలు జరిగినప్పటికీ విఫలం కావడంతో తాము 45 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెకు దిగినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను గుర్తించి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















