Seasonal Diseases: పానీపూరీ తింటే వచ్చే వ్యాధులు ఇవే, పెరుగుతున్న ఆ కేసులు - తెలంగాణ డీహెచ్ హెచ్చరిక
కోఠిలోని ప్రజారోగ్యశాఖ కార్యాలయంలో డీహెచ్ మాట్లాడారు. పానీపూరీలో వినియోగించే అపరిశుభ్ర నీటి వల్ల రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు.
ఈ కాలంలో ప్రజలు రోడ్లపై లభ్యమయ్యే పానీపూరీ వంటివాటికి దూరంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. పానీపూరీలో వినియోగించే అపరిశుభ్ర నీటి వల్ల రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. సీజనల్ వ్యాధులైన టైఫాయిడ్, మలేరియా సహా పలు వైరల్ జ్వరాలు వస్తాయని తెలిపారు. ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కోఠిలోని ప్రజారోగ్యశాఖ కార్యాలయంలో డీహెచ్ మాట్లాడారు.
తెలంగాణలో ఇప్పటికే డెంగీ కేసులు 1,184 ఉన్నట్లు గుర్తించామని, గతేడాదితో పోల్చితే ఈ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్‌లో 516, సంగారెడ్డి 97, కరీంనగర్ 84, ఖమ్మం 82, మేడ్చల్ 55, మహబూబ్‌నగర్ 54, పెద్దపల్లిలో 40 చొప్పున దాదాపు అన్ని జిల్లాల్లో డెంగీ జ్వరాల కేసులు కనిపించాయని చెప్పారు. ఒక్క జూన్ నెలలోనే 565 కేసులు నమోదయ్యాయని ఇది చాలా ఎక్కువని అన్నారు. జులైలో తొలి పది రోజుల్లోనే 222 డెంగీ కేసులు వచ్చాయని, 2019 తర్వాత మళ్లీ 2022లోనే వీటి పెరుగుదల ఉందని తెలిపారు.
మలేరియా కూడా
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ 203 మలేరియా కేసులూ నిర్ధారణ అయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో బ్యాక్టీరియా, వైరస్‌ల ప్రభావం పెరిగిందని, సీజనల్ వ్యాధులూ ఎక్కువగా వ్యాపిస్తున్నాయని శ్రీనివాసరావు తెలిపారు. వానలు తగ్గాక కూడా సీజనల్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అందరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డేగా పాటించాలని అన్నారు.
ఇంకా డీహెచ్ మాట్లాడుతూ.. ‘‘నీళ్ల విరేచనాల కేసులు రాష్ట్రంలో 6 వేలు, జిగట విరేచనాల కేసులు ఈ నెలలో 600 నమోదయ్యాయి. టైఫాయిడ్ కేసులు బాగానే ఉన్నాయి. మేలో 2,797 కేసులు, జూన్, జులైలో ఇప్పటివరకూ మొత్తం 2,752 కేసులు నమోదయ్యాయి.’’ అని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
‘‘ప్రజలు ‘ఫ్రై డే డ్రై డే’ కార్యక్రమం చేపట్టాలి. సరైన ఆహారం, మంచినీరు తీసుకోవాలి, ఆహారం వేడిగా ఉండేలా చూసుకోవాలి. గోరువెచ్చటి నీటిని తీసుకోవాలి. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం.’’ అని తెలిపారు.
జ్వరం, జలుబులా కరోనా
కరోనా ఓ సీజనల్ వ్యాధిగా మారిపోయింది. అయినా వృద్ధులు, గర్భిణులు, జాగ్రత్తలు తీసుకోవాలి. అంతా టీకా వేసుకోవాలి. కొత్త వేరియంట్ వస్తే ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం 5 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాలు జీరోగా నమోదవుతున్నాయి. కరోనా లక్షణాలున్నవారు 5 రోజులు ఐసొలేషన్‌లో ఉండాలి. లక్షణాలు తీవ్రమైతే ఆసుపత్రిలో చేరాలి. కొవిడ్ బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.’’ అని డీహెచ్ చెప్పారు.