Revanth On KCR: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి గెలుస్తారన్న ధీమాతోనే యశ్వంత్‌కు టీఆర్‌ఎస్ మద్దతు: రేవంత్
మోదీకి అనుకూలంగా ఉంటుంది.. బీజేపీకి ఉపయోగపడుతుంది అనుకుంటేనే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ముందుకు తీసుకెళ్తారన్నారు రేవంత్.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్‌తో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ, టిఆర్ఎస్ వ్యవహారాలు, పార్టీలో చేరికలు, రాహుల్ గాంధీ పర్యటనలు, విద్యార్థి, నిరుద్యోగ డిక్లరేషన్, దళిత, గిరిజన డిక్లరేషన్ అంశాలపై చర్చినట్టు తెలుస్తోంది.
పార్టీలో చేరికలపై స్థానిక సహా అన్ని పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నామని తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చేరికల వివరాలు బయటకు వస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నాయని ఆరోపించారు. వారిని బెదిరించి కాంగ్రెస్‌లో చేరకుండా చేస్తోందని విమర్శించారు. త్వరలోనే భారీ ఎత్తున చేరికలు ఉంటాయని.. దీనిపై ఇప్పటికే అధిష్ఠానం నుంచి స్పష్టత కూడా తీసుకున్నట్టు రేవంత్ వివరించారు.
చేరిలు ఉన్నప్పటికీ టికెట్లు వ్యవహారం ఎన్నికలు వచ్చినప్పుడే డిస్కషన్‌లోకి వస్తుందని ఇప్పుడు మాట్లాడుకోవడం మంచి కాదన్నారు రేవంత్ రెడ్డి. టికెట్‌ల కేటాయింపు అనేది గెలుపు ఒక్కటే ప్రామాణికం కాదన్న రేవంత్‌రెడ్డి... కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న నిబద్ధత, విశ్వసనీయత కూడా పరిగణలో తీసుకుంటామన్నారు. పార్టీ విధానం ప్రక్రియ ప్రకారమే టికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.
కెసిఆర్ గతంలో ఫెడరల్ ఫ్రంట్ అన్నా.. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పార్టీ అన్న కేవలం మోదీకి బిజెపికి ఉపయోగపడటం కోసమేనని ఆరోపించారు రేవంత్‌రెడ్డి. మోదీకి అనుకూలంగా ప్రతిపక్షాలను చీల్చే ఉద్దేశంతోనే కెసిఆర్ విశ్వప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విషయంపై మమతా బెనర్జీ నిర్వ హించిన విపక్షాల సమావేశానికి టీఆర్‌ఎస్ రాలేదని గుర్తు చేశారు రేవంత్. ఆ రోజు బిజెపి అభ్యర్థి ఓడిపోయే పరిస్థితి ఉందని అందుకే టీఆర్‌ఎస్ ఆ భేటీకి దూరంగా ఉందన్నారు. నవీన్ పట్నాయక్ ఇతర పార్టీలు మద్దతు ప్రకటించి బిజెపి అభ్యర్థి గెలుస్తారని స్పష్టత వచ్చాక విపక్షాల అభ్యర్థికి టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించిందన్నారు. మమతా బెనర్జీ సమావేశానికి హాజరుకాకుండా విపక్షాల అభ్యర్థి నామినేషన్‌కి హాజరు కావడంలోనే టిఆర్ఎస్ వ్యూహం, మోదీ అనుకూల విధానం స్పష్టమవుతుందన్నారు.
మోదీకి అనుకూలంగా ఉంటుంది.. బీజేపీకి ఉపయోగపడుతుంది అనుకుంటేనే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ముందుకు తీసుకెళ్తారన్నారు రేవంత్. పశ్చిమబెంగాల్లో లాగా మమతా బెనర్జీ తిరిగి అధికారం నిలబెట్టుకోవడానికి ప్రతిపక్షాల ఓట్లు అన్నిటినీ తనవైపునకు లాక్కోవడానికి చేసినట్లుగానే తెలంగాణలోనూ టీఆర్‌ఎస్ కోసం బీజేపీ చేస్తుందన్నారు. ప్రశాంత్ కిషోర్ పశ్చిమబెంగాల్లో ఏ రకంగా మమతా బెనర్జీకి బిజెపికి ఉపయోగపడే వ్యూహాన్ని అమలు చేశారో తెలంగాణలోనూ అదే వ్యూహం అమలు చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున చేరికలు ఉంటాయన్నారు సీఎల్పీనేత భట్టీ విక్రమార్క. చేరికల జాబితాపై అధిష్టానంతో చర్చించామన్నారు. పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని...దశల వారీగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామన్నారు. కేంద్రాన్ని మోదీని కేసీఆర్ ప్రశ్నించలేదని, కెసిఆర్‌ను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను మోదీ ప్రస్తావించలేదని గుర్తు చేశారు భట్టీ. మోదీ, కేసీఆర్ కావాలని కూడబల్కొని విమర్శలు చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో ఉంటే ఇద్దరం, రెండు పార్టీలే ఉండాలనే ఉద్దేశంతో వ్యవరిస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరి నాటకాలను ప్రజలకు వివరించే కార్యాచరణ రెడీ చేసినట్టు వివరించారు. బిన్నాభిప్రాయాలను బేధాభిప్రాయాలుగా చూడొద్దని మీడియాకు సూచించారు. పార్టీలో ఎవరు చేరినా.. ముందు నుంచి పార్టీలో ఉండి సిద్ధాంతాలకు కట్టుబడి వారికి ప్రాధాన్యత ఉంటుందని వివరిచారు.