Telangana News: ఆర్టీసీ నుంచి ఆటో వరకు ఏ వాహనం ఎక్కినా ఒకటే కార్డు- తెలంగాణలో కొత్త విధానం!
Telangana News: ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్, క్యాబులు, ఆటోలు... ఇలా ఏ వాహనంలో ప్రయాణించినా ఒకే ఒక్క కార్డు వినియోగించుకునే సౌలభ్యాన్ని కల్పించబోతోంది తెలంగాణ సర్కారు.
Telangana News: ఆర్టీసీ బస్సు నుంచి ఆటోల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడానికి వీలుగా తెలంగాణ సర్కారు ఒకే కార్డును అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఆగస్టు రెండో వారంలో కామన్ మొబిలిటీ కార్డులను సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్, తెలంగాణ ఆర్టీసీ సంస్ధలు కార్యచరణ ప్రారంభించాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రధానమైన ప్రజా రవాణా మార్గాలుగా ఉన్న మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలుండే విధంగా ఈ కార్డు ఉండనుంది. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రవాణాాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో ఈ మధ్య జరిగిన సమావేశంలో ఆర్టీసీ, మెట్రో రైల్ సంస్థల ఉన్నతాధికారులు ఈ కార్డుకు సంబంధించిన పలు వివరాలను అందించారు. ఈ కార్డు జారీ ప్రక్రియ నుంచి మొదలుకొని వివిధ ప్రాంతాల్లో దాని ఉపయోగం వరకు నగర ప్రజలకు అందుబాటులో ఉండే సేవల వివరాలను అధికారులు మంత్రులకు తెలియజేశారు.
To enhance the experience of commuting through public transportation in Hyderabad city, Telangana government announced the introduction of a Common Mobility Card.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 20, 2023
Initially, it will facilitate travel via Metro Rail and @TSRTCHQ buses, with plans to extend its usability to MMTS,… pic.twitter.com/WKhXDEhGYe
మొదట మెట్రో, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా కార్డులు
మొదట మెట్రో రైల్ , ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డుని జారీ చేస్తామని, ఇదే కార్డుతో సమీప భవిష్యత్తులో ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకునే విధంగా విస్తరిస్తామని మంత్రులు తెలిపారు. ఇదే కార్డుతో భవిష్యత్తులో పౌరులు తమ ఇతర కార్డుల మాదిరే కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్ మాదిరి ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగరం వరకు ఈ కార్డు జారీ ఉంటుందని అన్నారు. అలాగే త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్డు సేవలు అందించేలా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. ఈ కార్డు కలిగిన పౌరులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట వాడుకునే అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు.
ఆగస్టు రెండో వారంలోగా కార్డుల అందజేత
దీంతో ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ కార్డు వలన ఇతర మెట్రో నగరాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆర్టీసీ బస్సులు లేదా మెట్రో రైల్ ఇతర ప్రజా రవాణా వ్యవస్థను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్డును ప్రయోగాత్మకంగా ఆగస్టు రెండవ వారంలోగా నగర పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి మెట్రో రైల్ మరియు ఆర్టీసీ సంస్థ అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు పోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనున్న ఈ కామన్ మొబిలిటీ కార్డుకి ఒక పేరును సూచించాలని కోరారు.