Cyber Crime: గణేష్ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్ 15-నమ్మితే అకౌంట్ ఖాళీ అయినట్టే
వినాయక చవితి ఉత్సవాల్లో సైబర్ నేరగాళ్లు కొత్త దందా మొదలుపెట్టారు. ఇండియా పోస్ట్ నిర్వహించిన లక్కీడ్రాలో ఐఫోన్-15 వచ్చిందని లింకులు పంపుతున్నారు. క్లిక్ చేసిన వారి అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు.
లక్కీ డ్రాలో మీపేరు వచ్చింది. ఐఫోన్-15 గెలుచుకున్నారు. అంటూ మీకు లింకులు వచ్చాయా..? అయితే తస్మాత్ జాగ్రత్త. నిజమే అనుకుని లింకుపై క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు. మీ అకౌంట్‌లో ఉన్న డబ్బంతా దోచేస్తారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది.
వినాయక చవిత ఉత్సవాలను ఆసరా చేసుకుని అమాయకులకు వల వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇండియా పోస్టాఫీసు లక్కీ డ్రా నిర్వహించిందని... కల్లబొల్లి కథలు అల్లుతున్నారు. ఆ లక్కీడ్రాలో మీ పేరు వచ్చిందని... మీరు ఐఫోన్-15 గెలుచుకున్నారని లేనిపోని లింకులు పంపుతున్నారు. లక్కీడ్రాలో వచ్చిన ఐఫోన్-15 మీ సొంతం కావాలంటే వాళ్లు పంపిన లింకులోని క్లిక్ అండ్ కంటిన్యూ బటన్ నొక్కాలని మెసేజ్‌కు చెప్తున్నారు. అది నిజమేనని నమ్మిన వారు చెప్పినట్టు చేసిన వారిని నిలువునా దోచేస్తున్నారు సైబర్ నేరళాళ్లు.
అంతేకాదు... ఇండియన్ పోస్టాఫీస్ పేరుతో వాళ్లు పంపే మెసేజ్‌ను ఐదు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయాలని చెప్తున్నారు. ఇండియా పోస్టు వెబ్‌సైట్ పేరుతో పోస్టు పెడుతున్నారు. నిజంగా ఇండియా పోస్టాఫీసు నుంచే మెసేజ్ వచ్చిందనుకుని చాల మంది ఆ మెసేజ్‌ను తెలిసిన వారికి... తమ దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. అయితే... తాము ఎలాంటి పోస్ట్ పెట్టలేదని... లక్కీడ్రాలు నిర్వహించలేదని ఇండియా పోస్టు ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. ఇండియా పోస్టు లక్కీడ్రా పేరుతో జరుగుతున్న ప్రచారాలు నమ్మవద్దని సూచించింది. క్లెయిమ్‌పై క్లిక్ చేస్తే నష్టపోవడం ఖాయమని కచ్చితంగా చెప్పేసింది.
వినాయక చవిత ఉత్సవాలే కాదు.. పండుగల సందర్భంగానూ సైబర్ నేరగాళ్లు ఇలా ఏదో ఒక లక్కీడ్రా పేరు చెప్పి అమాయకులను మోసం చేస్తూనే ఉంటారు. లక్కిడ్రా పేరుతో చాలా మందికి ఇలాంటి మెసేజ్‌లు చాలానే వచ్చుంటాయి. కనుక... ఇలాంటి పోస్టులు, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అత్యాశకు పోయి లింకులు క్లిక్ చేశారో... సైబర్ నేరగాళ్ల వలలో పడినట్టే. పొరపాటున లింకులు క్లిక్ చేసినా.. డబ్బును కొల్లగొట్టేస్తారు మోసగాళ్లు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు. డబ్బు పోయాక వెనక్కి తెచ్చుకోవడం కష్టమని.. ముందే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చు పడి మోసపోతే.. వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు. లేదా... cybercrime.gov.inలో కూడా ఫిర్యా దు చేయొచ్చని సూచిస్తున్నారు. కానీ.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటమే ఉత్తమమని హెచ్చరిస్తున్నారు.