Hyderabad News: గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
Telangana Group 1 Candidates protest against GO 29 in Groups Exam
హైదరాబాద్: గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 29 ను రద్దుచేసి తమకు న్యాయం జరిగేలా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అశోక్ నగర్ చౌరస్తాకు పెద్ద ఎత్తున గ్రూప్స్ అభ్యర్థులు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. ఇంకా ఒక్కరోజే ఉందని, ఈరోజైనా తెలంగాణ ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోవాలని రిక్వెస్ట్ చేస్తన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను తొలగించాలనేది జీవో 29 రద్దుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
పదేళ్లు పూర్తయినా గ్రూప్ 1 జాబ్స్ భర్తీ చేయలేదు..
తెలంగాణ వచ్చి పదేళ్లు పూర్తయినా ఒక్కసారి కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. దాంతో గ్రూప్స్ ఉద్యోగాల కోసం చదువుతున్న అభ్యర్థుల తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదివరకే రెండ పర్యాయాలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు చేశారు. మూడోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రిలిమ్స్ నిర్వహించి, మెయిన్స్ కు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 21 నుంచి వారం రోజులపాటు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అయితే జీవో నెంబర్ 29 వల్ల రిజర్వేషన్లు కోల్పోతున్నామని కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు రావని అభ్యర్థులు చెబుతున్నారు. అందువల్ల సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 29 రద్దు చేసి గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించినా తమకు ఏ సమస్య లేదని చెబుతున్నారు.
మా మాటలు వింటే సీఎం మాతో ఏకీభవిస్తారు..
అభ్యర్థులు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టుకు వెళితే తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్నారు. అయితే రెండు, మూడుసార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాయడానికి మానసికంగా తాము సిద్ధంగా లేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి కోచింగ్ తీసుకుని చదవడానికి, హాస్టల్లో, రూముల్లో ఉండేందుకు అంత ఆర్థిక స్థోమత లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కొందరు మిస్ గైడ్ చేస్తున్నారని.. మీ నుంచి మాకు పిలుపు వస్తుందని ఇప్పటివరకూ ఎదురూచూశామని చెప్పారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడే అవకాశం ఇస్తే, తమ సమస్యలు చెప్పుకుంటామన్నారు. మేం చెప్పేది వింటే మా మాటలతో, నిర్ణయంతోనే సీఎం రేవంత్ కూడా ఏకీభవిస్తారని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రం గా వ్యతిరేకిస్తున్నారు. మొన్నటివరకూ హరీష్ రావు, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించారు. రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు అని.. కానీ నేడు నిరుద్యోగుల పక్షాన నిలవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ జీవో 29 తీసుకొచ్చిందని వ్యతిరేకించారు.
విద్యార్థుల నిరసనకు బండి సంజయ్ మద్దతు
కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం నిరుద్యోగుల సమస్యపై గళం విప్పారు. శనివారం నాడు నేరుగా అశోక్ నగర్ కు వెళ్లి మరీ విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. వారితో పాటు రోడ్డుపై బైఠాయించి గ్రూప్ 1 మెయిన్ వాయిదా వేయాలని, లేకపోతే జీవో 29 రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆపై ఛలో సెక్రటేరియట్ ర్యాలీకి పిలుపునిచ్చారు. సెక్రటేరియట్ కు గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి ర్యాలీగా వెళ్తొంటే పోలీసులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయినా ఆయన వాహనం దిగి మరోసారి రోడ్డుపై నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు.