New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
New Ration Cards: కొత్తకార్డులను త్వరలోనై అర్హులైన వారికి అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అక్టోబర్ రెండు నుంచి అప్లికేషన్లు తీసుకోవడానికి ఓకే చెప్పింది.
Revanth Reddy: ఎప్పటి నుంచో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 2 నుంచి కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రులు ప్రకటించారు. దీనికి సంబందించిన విధివిధానాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. మరోసారి సమావేసమై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని తేల్చారు.
అక్టోబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో రేషన్ కార్డును ఆధారంగా చేసుకొని చాలా పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టంది. అందుకే కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ఊరట ఇచ్చే విషయాన్ని చెప్పింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు స్పష్టం చేసింది.
అర్హులైన వారందరికీ కార్డులు
తెలంగాణలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు జారీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముందు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని స్క్రూట్నీ చేస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నారు. ప్రస్తుతానికి దరఖాస్తుల స్వీకరణకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి పటిష్ట కార్యాచరణ చేపట్టాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
డిజిటల్ కార్డులపై త్వరలోనే నిర్ణయం
ఫిజికల్ కార్డులకు బదులు డిజిటల్ కార్డుల జారీపై కూడా ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. అయితే దీనిపై మరింత స్టడీ చేయాల్సి ఉందన్న సీఎం మరోసారి సమావేశమైనప్పుడు చర్చిద్దామని అన్నారు.
సన్నబియ్యం ఇచ్చేందుకు కసరత్తు
మరోవైపు జనవరి నుంచి ఇస్తామన్న సన్నబియ్యంపై కూడా సర్కారు కసరత్తు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం ఉన్న నిల్వలు సరిపోవని మరిన్ని సేకరించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై సమాలోచనలు జరుపుతోంది పౌరసరఫరాల శాఖ. రాష్ట్రంలో ప్రస్తుతం 50 వేల మెట్రిక్ టన్నులు సన్నబియ్యం నిల్వలు ఉన్నాయి. జనవరి నుంచి సరఫరాకు అవసరమయ్యే బియ్యాన్ని సేకరించే పనిలో పడింది.
సన్న బియ్యం ఇవ్వాలంటే 24 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం
అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. 33 జిల్లాల పరిధిలో రేషన్ కార్డుదారులకు ఇచ్చేందుకు 1.80 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరం అవుతాయి. రేషన్ కార్డులతోపాటు హాస్టల్స్, స్కూల్‌లో మధ్యాహ్న భోజనానికి కూడా సన్న బియ్యం సరఫరా చేయవచ్చు. దీనికి ప్రతీ సంవత్సరం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. మొత్తంగా ఒక్కో సంవత్సరానికి దాదాపు 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉంచుకోవాలి.