Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష
కంటి వెలుగు, జీ. ఓ. ఎం. ఎస్. నం.58, 59, పోడు పట్టాలు, ఆయిల్ ఫామ్ సాగు, ఉపాధ్యాయుల బదిలీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల లక్ష్యాలను సాధించే దిశగా అధికార యంత్రాంగం కృషి చేయాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కంటి వెలుగు, జీ. ఓ. ఎం. ఎస్. నం.58, 59, పోడు పట్టాలు, ఆయిల్ ఫామ్ సాగు, ఉపాధ్యాయుల బదిలీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఫిబ్రవరి 1 నుంచి దశలవారీగా పాఠశాలలు ప్రారంభం
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం మొదటి విడతలు ఎంపికైన పాఠశాలల్లో పనులను వేగవంతం చేసి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దశలవారీగా పాఠశాలల ప్రారంభోత్సవానికి తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంబంధిత గ్రామాలు, పట్టణాలలో పండగ వాతావరణం కనిపించాలని ఆదేశించారు.
కంటి పరీక్షల వివరాలు ఆన్ లైన్ లోకి..
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పోడు పట్టాలను కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అర్హులైన గిరిజనులకు పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి హాబిటేషన్లో ఎఫ్. ఆర్. సి. కమిటీ సభ్యులతో గ్రామ సభలు పూర్తిచేసి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు సబ్ డివిజన్ కమిటీ సిఫార్సుల ప్రకారం అర్హులైన వారికి అందజేయడం కోసం చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19వ తేదీన ప్రారంభమైన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం లో భాగంగా జిల్లాలు 26 బృందాలను ఏర్పాటు చేసి కంటి వెలుగు శిబిరాలను జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కంటి పరీక్షల కోసం శిబిరాలకు వచ్చే ప్రజల కోసం అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, పరీక్షలు నిర్వహించి మందులతో పాటు అవసరమైన వారికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేస్తున్నామని, పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని, శిబిరాల నిర్వహణ కోసం వచ్చిన సిబ్బందికి కల్పించడం జరిగిందని తెలిపారు.
టీచర్ల బదిలీలు, పదోన్నతులపై నిర్ణయాలు
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో భాగంగా 8 సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీకి చర్యలు తీసుకోవడంతో పాటు సీనియారిటీ రిజర్వేషన్ ప్రకారం పదోన్నతులకు చర్యలు తీసుకుంటున్నామని, అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయుల ధ్రువపత్రాలు పరిశీలన, అభ్యంతరాలపై క్షుణ్ణంగా విచారించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలు మొదటి విడతలు ఎంపికైన పాఠశాలల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఆయిల్ ఫామ్ సాగుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖల అధికారుల సమన్వయంతో ఆయిల్ ఫాం సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జి. ఓ. ఎం. ఎస్. నం. 58, 59 కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్, జిల్లా విద్యాధికారి అశోక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మణెమ్మ, రోడ్డు భవనాల శాఖ ఈ ఈ పెద్దన్న, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.