Telangana Congress Leaders: ఇకపై అలా చేస్తే గాంధీ భవన్ రాలేరు- తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ క్లాస్
పోట్లాడుకుంటే పలుచనైపోతారు.. ప్రజాసమస్యలపై పోరాడితేనే జనంలో ఉండేదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం హితబోధన చేసింది. రాహుల్‌తో జరిగిన మూడు గంటల భేటీలో చాలా అంశాలు చర్చించారు.
తెలంగాణ నేతల పంచాయితీ దిల్లీకి చేరింది. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ వ్యూహాల్లో బిజీగా ఉంటూ.. ప్రజాసమస్యలపై పోరాడుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం తమ ఉనికి కోసం సహచరులతోనే గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. అసలే మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కలిసి రాలేదు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో నేతలు చాలా ఆత్మరక్షణలో ఉన్నారు. తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా ఇక్కడ నేతల మధ్య తగాదాలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి.
ఈ పరిస్థితిల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న విభేదాలు తొలగించి వారిని ఒకే మార్గంలో నడిచేలా ప్రయత్నాలు చేసింది. ఎవరికి వారు అపాయింట్‌మెంట్స్ అడుగుతుండటంతో అందర్నీ పిలిచి మాట్లాడింది. అధిష్ఠానం తరఫున రాహుల్ గాంధీ తెలంగాణ లీడర్లతో సమావేశమయ్యారు. సుమారు మూడు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు.
తెలంగాణలో ఉన్న పరిస్థితులపై కొన్ని రిపోర్టులు తెప్పించుకొని నేతలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలందర్నీ ఒకే చోట కూర్చోబెట్టి మాట్లాడినట్టు సమాచారం. ఈ సందర్భంగా రేవంత్ తీరు సరిగా లేదని.. సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదంటూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు రేవంత్ వర్గం కూడా కొందరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ నేతలతో రహస్య సమావేశాలు జరుపుతున్నారని ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుందని చెప్పినట్టు వినికిడి.
ఇలా రెండు వర్గాల వాదనలు విన్న రాహుల్ గాంధీ... వారందర్నీ సముదాయించారు. నేతల మధ్య సఖ్యత లేకుంటే ప్రజల్లో చులకలన అవతారని హితబోధన చేశారు. తెలంగాణ ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని.. రైతులను నట్టేటా ముంచాయి దీనిపై పోరాటం చేయాలని సూచించారు. అవసరమైతే తాను కూడా తెలంగాణ పర్యటిస్తానని చెప్పినట్టు సమాచారం.
ప్రజాసమస్యలపై పోరాటానికి ఒక కార్యాచరణ రూపొందించాలని రాహుల్ సూచించారు.
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎంపికైనప్పటి నుంచి ఓ వర్గం కాంగ్రెస్ నేతలతో ఆయనకు పడటం లేదు. మొదట్లోనే కోమటిరెడ్డి లాంటి వాళ్లు ఘాటుగానే నేరుగా రేవంత్‌పై విమర్శలు చేశారు. అధిష్ఠానం ఏం చెబితే అది చేస్తానంటూనే రేవంత్‌రెడ్డిపై సమయం చిక్కినప్పుడల్లా ఆరోపణలు చేస్తూ వచ్చేవారు. కాలం గడిచే కొద్ది ఆయన ప్రజాసమస్యలపై పోరాడుతూ కొందరు నేతలను తనవైపు తిప్పుకున్నారు. కానీ మరికొందరు ఆయనకు దూరంగానే ఉండిపోయారు. అలాంటి వారిలో జగ్గారెడ్డి, వీహెచ్ లాంటి వాళ్లు ముందు వరుసలో ఉంటున్నారు.
జగ్గారెడ్డి అయితే పార్టీకీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కావాలనే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని... తాను టీఆర్‌ఎస్‌తో సఖ్యతగా ఉన్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీలో ఉండలేనంటూ స్వతంత్రంగా ఉంటానంటూ అలకబూనారు. తర్వాత రేవంత్ వెళ్లి మాట్లాడినా ఆయన శాంతించలేదు. రేవంత్ ఉంటే పార్టీ తెలంగాణలో బతకదని చాలా మంది పార్టీకి దూరమవుతారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇలా రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ నేతలను అధిష్ఠానం పిలిచి తలంటిందని తెలుస్తోంది. విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు రాహుల్ గాంధీ. మనస్పర్థలు, విభేదాలు ఉంటే పార్టీ అధిష్ఠానానికి చెప్పాలని సూచించారు. అంతే కానీ మీడియా ముందు మాట్లాడొద్దని చెప్పారు. అలా చేసిన వారిపై చర్యలకు వెనుకాడబోమన్నారు.
భేటీ అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు... కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా పోరాడుతామన్నారు. సమాజంలో చీలిక తెచ్చేందుకు బీజేపీ, టీఆర్‌ఎస్ పని చేస్తున్నాయని మండిపడ్డారు. నేతలందరూ ఒకే గొంతుకై ప్రజల తలుపు తడతామన్నారు. టీఆర్‌ఎస్, మజ్లిస్‌తో పొత్తులు ఉండబోవని రాహుల్ చెప్పారని వెల్లడించారు.
ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు కేటాయిస్తామన్నారని... ఐకమత్యంతో ఉంటూనే టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ప్రజాసమస్యలపై పోరాటంలో భాగంగా వీలైనన్ని ఎక్కువ సార్లు తెలంగాణ వస్తానని రాహుల్ చెప్పినట్టు తెలిపారు.