Telangana CM Revanth Reddy: రైతుల ఖాతాల్లో 18వేల కోట్లు వేశాం- ప్రధాని మోదీకి ఘాటు లేఖ రాసిన సీఎం రేవంత్
Telangana : సరైన సమాచారం లేకుండా ప్రధానమంత్రి మోదీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. వాస్తవాలు తెలుసుకోండని లేఖ రాశారు. నిజాలు తెలుసుకొని మరింత సాయం చేయాలని కోరారు.
Telangana CM Revanth Reddy: 9 నెలలుగా తెలంగాణలో అమలు చేసిన పథకాలు, ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం లెటర్ రాశారు. గత కొన్ని రోజులుగా తెలంగాణతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేసుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతున్నారు. అధికారంలోకి రావడానికి అనేక ఉచిత హామీలు ప్రకటిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోతుందని విమర్శలు చేస్తున్నారు. జమ్ముకశ్మీర్, హర్యానా ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేస్తూ వచ్చారు. నిన్నటి నిన్న మహారాష్ట్రలో కూడా ఇదే విధమైన విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉండటంతో ప్రధానమంత్రి చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన పనులను వివరిస్తూ లేఖ రాశారు. కాంగ్రెస్ గ్యారెంటీలు అంటే గోల్డెన్ గ్యారెంటీలుగా ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రధానికి వివరించారు. ఆ వివరాలను ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పోస్టు చేశారు.
Dear Shri @narendramodi ji - Apropos, and in response to your speech mentioning about farmers loan waivers in Telangana - I am sharing all facts about its successful implementation within our first year of governance.
— Revanth Reddy (@revanth_anumula) October 6, 2024
In our Government…every crop loan below Rs 2 lakh was… pic.twitter.com/Mwl1I9pZwj
రైతులను కాంగ్రెస్ పార్టీ హామీల పేరుతో నిలువునా మోసం చేసిందన్న ప్రధానమంత్రి విమర్శలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఇచ్చిన మాట ప్రకారం 22,22,067 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్టు వివరించారు. రైతుల ఖాతాల్లో 17,869.22 కోట్లు రూపాయలు వేసినట్టు గుర్తు చేశారు. 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ రుణం ఉన్న వారిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. వారి త్వరలోనే రుణమాఫీ చేయబోతున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో హామీ అమలు చేస్తూ వస్తున్నామని వివరించారు రేవంత్ రెడ్డి.
రుణమాఫీ విషయంలో కూడా కట్టుబడి మొదటి విడత రుణమాఫీని జులై 18న చేసినట్టు పేర్కొన్నారు. మొదటి విడతలో 11,34,412 మంది రైతుల ఖాతాల్లో 6034.97కోట్ల రూపాయలను వేశామని తెలిపారు. రెండో విడత కింద 6190.01 కోట్లు జమ చేశామని వివరించారు. ఆగస్టు 15న మూడో విడత 5644.24 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. అంకిత భావంతో వాళ్లకు ఇచ్చిన ప్రతి మాట అమలు చేస్తున్నామని తెలిపారు. వారిపై అప్పుల ఒత్తిడి లేకుండా చేయడమే ధ్యేయంగా పాలసీలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.
తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మీ సహాయ సహకారాలు కావాలని ప్రధానమంత్రికి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇద్దరం కలిసి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొదించే ప్రయత్నాలు చేద్దామని పిలుపునిచ్చారు. తాము రైతులకు ఏం చేశామో అన్నీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు రేవంత్ రెడ్డి. అవే తమ చిత్తశుద్ధిని తెలియజేస్తాయని పేర్కొన్నారు.