KCR Review On Rains: ముంపు ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టండి- భారీ వర్షాలు, వరదలపై సమీక్షలో కేసీఆర్
KCR Review Meeting on Rains: సీఎం కేసీఆర్ వర్షాలపై శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
Telangana CM KCR Review Meeting on Rains : హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వరద నీటితో పలు ప్రాంతాలు జలాశయాల్లా మారిపోయాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోందని మొదటి ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ వర్షాలతో వరద నీరు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వర్షాలపై శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సీఎస్శాంతి కుమారి, పలు శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వర్షాలు, నీటిపారుదల, ఆర్థిక, బీసీ శాఖలు, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు చేయాలని, ధాన్యం ఉత్పత్తి మేరకు ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చర్చించారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, వరద నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
భద్రాచలం వద్ద ముంపు పరిస్థితిపై సీఎం ఆరా
గోదావరిలో వరదల పరిస్థితి, భద్రాచలం వద్ద ముంపు పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. ప్రాణహిత తదితర నదుల ద్వారా కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల్లో చేరుతున్న వరద గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని సీఎస్ శాంతికుమారి సీఎం కేసీఆర్ కు వివరించారు. భద్రాచలం వద్ద వరదను అంచనా వేస్తూ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉందని చెప్పారు. శని, ఆదివారాల్లోనూ భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సచివాలయంతో పాటు, కలెక్టరేట్లో, ఎమ్మార్వో ఆఫీసులలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది. సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్లను, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కంట్రోల్ రూం సహా హెలీకాప్టర్లు సంబంధిత సహాయకచర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు, భద్రాచలంలో సహాయక చర్యలకు ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్షించారు. మొదటి ప్రమాద హెచ్చరిక వివరాలపై అధికారులను ఆరా తీశారు. వరద పెరిగితే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు గురువారం ఒక్కరోజు అత్యధికంగా 34.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం కురిసింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial