Revanth Reddy: ఆక్రమణదారులు జైలుకే- స్వచ్చందంగా వదలుకోకుంటే చర్యలు తప్పవు- హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
Revanth Reddy On HYDRA: చెరువులను చెరపట్టిన వాళ్లను వదిలే ప్రసక్తి లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కచ్చితంగా అక్రమ కట్టడాలను నేలకూలుస్తామన్నారు.
![Revanth Reddy: ఆక్రమణదారులు జైలుకే- స్వచ్చందంగా వదలుకోకుంటే చర్యలు తప్పవు- హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్ Telangana Chief Minister Revanth Reddy made sensational comments at passing out parade program held in Hyderabad Police Academy Revanth Reddy: ఆక్రమణదారులు జైలుకే- స్వచ్చందంగా వదలుకోకుంటే చర్యలు తప్పవు- హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/6c9b660cff789d69a489476811051dfc1726037433697215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana CM Revanth Reddy: హైడ్రా పనితీరు భవిష్యత్ కార్యచరణపై తెలంగాణ ముఖ్యమంత్రి సంచలన కామెంట్స్ చేశారు. ఆక్రమణదారులను అవసరమైతే జైలుకు పంపించేందుకు కూడా వెనుకాడబోమన్నారు. ముందుగానే మేల్కొంటే మాత్రం మంచిదని సూచించారు.
వరదలకు కారణం అదే
హైదరాబాద్‌లో జరిగిన పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయని తెలిపారు. వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని అందుకే ప్రక్షాళన చేపట్టినట్టు తెలిపారు.
ఇదే హెచ్చరిక
చెరబట్టిన వారి నుంచి హైడ్రాతో చెరువులను విడిపిస్తున్నామన్నారు రేవంత్. అవసరమైతే ఆక్రమణదారులను జైలుకు పంపేందుకూ వెనకాడబోమన్నారు. ఆక్రమించుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదులుకోవాలని ఆక్రమనదారులకు ఆఫర్ ఇచ్చారు. లేకపోతే చెరువులలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతామని హెచ్చరించారు.
మూసీ ప్రక్షాళన
నాలాల ఆక్రమణలను నిరభ్యంతరంగా కూల్చేస్తామన్న రేవంత్... ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు. మూసీ నాలాల్లో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. నివాసితులైన 11వేల మందిలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని భరోసా కల్పించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
పోలీసులకు వరాలు
ఇదే వేదికపై నుంచి పోలీసులకు వరాలు ప్రకటించారు. పోలీసుల పిల్లల కోసం రెండు రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఒకటి వరంగల్‌లో రెండోది నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో 50 ఎకరాల్లో పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. 50 ఎకరాల్లో వరంగల్‌లో మరో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్‌లో పోలీస్ స్కూల్ ప్రవేశాలు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
పోలీసులు ఉద్యోమనేది బాధ్యతమాత్రమే కాదని... భావోధ్వేగమని అన్నారు. తెలంగాణను పునర్నిర్మించి, భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు రేవంత్. ఏ సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులేనని అందుకే వారు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలని సూచించారు.
తెలంగాణను కాపాడుకునేందుకే ఖాకీ డ్రస్సులనే విశ్వాసం ప్రజలకు కల్పించాలని అన్నారు రేవంత్. అదే టైంలో తెలంగాణ యువతను వ్యసనాల బారిన పడేస్తున్న డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కు పాదం మోపాలని సూచించారు. అందరిని చూస్తోంటే తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం మోపుతామని... డ్రగ్స్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలని అన్నారు.
కాంక్రీట్ పోలీసింగ్ అవసరం
కాస్మెటిక్ పోలీసింగ్ కాకుండా కాంక్రీట్ పోలీసింగ్ అవసరమన్నారు రేవంత్. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే నేరస్తులకు కాదన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర చాలా ముఖ్యమన్నారు రేవంత్ రెడ్డి. యువత ప్రాణత్యాగంతో సాదించుకున్న తెలంగాణ తొమ్మిదేళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొందన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని గుర్తు చేశారు. అన్నింటినీ చూసిన ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. వారి దయతో ప్రజాప్రభుత్వ ఏర్పడిందని వివరించారు.
తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్టు పేర్కొన్నారు రేవంత్. ఒక్కో వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ వచ్చామని ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రక్షాళించామన్నారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేసారు. తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధం అవుతున్నారని ఆకాంక్షించారు.
తమ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడం, ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటోందన్నారు రేవంత్. కేవలం 28రోజుల్లోనే 22 లక్షల 22 వేల 685 రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు వేసి రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. కడుపు కట్టుకుని నిధులు సేకరించి రుణమాఫీ చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని అభిప్రాయపడ్డారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)