Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బడ్జెట్‌లో కీలక ప్రకటన, నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం
TS Indiramma Housing Scheme తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని పేదవారికి శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలున్నర లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

Telangana Budget 2025 Live Updates | హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇందిరమ్మ ఇండ్లు పథకం (Indiramma Housing Scheme), ఇళ్ల పట్టాలపై కీలక ప్రకటన చేశారు. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగానూ వార్షిక బడ్జెట్ అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2024, మార్చి నెలలో ప్రారంభించినట్లు తెలిపారు. అర్హులైన పేదలకు మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం 4 లక్షల 50 వేల (4,50,000) ఇండ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఆశలు రేకెత్తించింది. కానీ అర్హులైన పేదలకు చివరకు నిరాశ నిస్పృహలనే బీఆర్ఎస్ పాలన మిగిల్చింది. అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాలలో 34 వేల 5 వందల నలభై ఐదు (34,545) నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వందల ఐదు కోట్ల మూడు లక్షల రూపాయల (305.03 కోట్లు) నిధులను కేటాయించింది. ఔటర్ రింగు రోడ్డుని ఆనుకొని హైదరాబాద్ (Hyderabad) సిటీ నలువైపులా శాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పాటు చేసి, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా ఇండ్లను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
గృహజ్యోతిని విజయవంతంగా అమలు చేస్తున్నాం
తెలంగాణలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీలలో భాగంగా విద్యుత్ ఛార్జీల బారం లేకుండా ప్రభుత్వం ఊరట కలిగిస్తోంది. ఈ ఉచిత్ విద్యుత్ పథకం ద్వారా 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. గృహజ్యోతి పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల పదిహేను లక్షల రూపాయలను విద్యుత్ సంస్థలకు సబ్సిడీగా చెల్లించినట్లు పేర్కొన్నారు.






















