CM Revanth reddy: రాష్ట్రాల వాటా 50 శాతానికి పెంచండి- 16వ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను పెంచాలని 16వ ఆర్థిక సంఘం కోరారు సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
16th Finance commission Meeting in TS: తెలంగాణ ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు ముఖ్యమంత్రి. తెలంగాణ కొత్త రాష్ట్రమని, వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని అన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ కోసం సహకరించాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు రేవంత్‌రెడ్డి.
దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth reddy). తెలంగాణకు బలైమన పునాదులు ఉన్నా... ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారు. భారీ రుణ భారం తెలంగాణపై ఉందని... అది తెలంగాణకు ఒక పెద్ద సవాల్‌గా మారిందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ (Telangana) అప్పు 6లక్షల 85వేల కోట్లకు చేరిందన్నారు.రాష్ట్ర ఆదాయంలో సగభాగం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకే సరిపోతుందని అన్నారు రేవంత్‌రెడ్డి. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు తమ రాష్ట్రానికి కేంద్రం మద్దతు అవసరమని అన్నారు. రుణాల రీస్ట్రక్చర్‌కు అవకాశం ఇవ్వాలన్నారు రేవంత్‌రెడ్డి. ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం నుంచి సహకారం కోరుతున్నామన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులు ఆ దిశగా ఉండాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచండి...
కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని(16th Finance commission) కోరారు సీఎం రేవంత్‌రెడ్డి. గత పదేళ్లలో ప్రాజెక్టుల కోసం భారీగా అప్పులు చేశామరని... ఆదాయంలో అధికంగా రుణాల చెల్లింపులకే సరిపోతుందని చెప్పారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించాల్సి ఉందని... లేదంటే.. రాష్ట్ర పురోగతిపై పెను ప్రభావం పడుతుందన్నారు. రుణ సమస్యను పరిష్కరించుకునేందుకు తగిన సాయం, మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్ర పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలన్న తమ డిమాండ్ నెరవేరిస్తే... దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని మోడీ లక్ష్యానికి తాము సహకరిస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు. దీని కోసం.. తెలంగాణ రాష్ట్రానికి తగిన ఆర్థిక సాయం చేయాలని కోరారు.
కేంద్రం పథకాలపై ఏమన్నారంటే...
కేంద్రం ఇచ్చే పథకాలను వినియోగించుకోవాలంటే.. కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Batti Vikramarka). దీని వల్ల కేంద్ర పథకాలను వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. రాష్ట్రలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకునేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరారు. అంతేకాదు... రాష్ట్రానికి భారంగా మారిన రుణాల రీ-స్ట్రక్చరింగ్ చేయాలని కోరారు. రుణాల రీస్ట్రక్చరింగ్ చేసుకునే అవకాశం కల్పించలేకపోతే... అదనపు ఆర్థిక సాయమైనా చేయాలని కోరారు.
16వ ఆర్థిక సంఘం సమావేశం గురించి....
తెలంగాణలో స్థానిక సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం ప్రజాభవన్‌లో సమావేశం అయ్యింది. డాక్టర్ అరవింద్ పనగారియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.