స్వరం మార్చిన మల్లన్న, అంతా సారే చూసుకుంటారు? ఇంతకీ పెద్దసారు ఏం ధైర్యమిచ్చారో?
ఐటి దాడులు జరిగి రోజు మల్లారెడ్డి మాట్లాడిన మాటలకు ఐటి అధికారులు వెళ్లిపోయిన తర్వాత మాట్లాడిన మాటలకు చాలా తేడా ఉందనేది అర్థం అవుతోంది. మొదట్లో కొంత ఇబ్బంది పడ్డ మల్లన్న ఆ తర్వాత తన స్వరాన్ని మార్చారు.
స్వరం మారింది.. తీరు కూడా మారిందంటున్నారు మంత్రి మల్లారెడ్డిని చూసినవాళ్లంతా. రెండురోజుల పాటు జరిగిన ఐటీ దాడుల అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి మాటల్లో మళ్లీ మునుపటి దమ్ము కనిపించిందంటున్నారు అభిమానులు. అంతా ఆయనే చూసుకుంటారు.. కెసిఆర్‌నే నమ్ముకున్నాం అంటున్న మల్లన్న మాటల్లోని ఆంతర్యం ఏంటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఊహించిన విధంగానే తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులు సాగుతున్నాయి. అధికారపార్టీకి ఊపిరాడకకుండా వరస పెట్టి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ కేంద్రసంస్థల దాడులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన దాడులు ఒక ఎత్తు అయితే మంత్రి మల్లారెడ్డిపై జరిగిన ఐటీ దాడులు మరో ఎత్తు. రెండు రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో దాదాపు రూ.11 కోట్లు , కీలకపత్రాలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏఏ పత్రాలు, ఎంత నగదును తీసుకెళ్లరాన్న దానిపై మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు స్పష్టత నివ్వకపోయినా ఆయన స్వరంలో మాత్రం మళ్లీ మునుపటి గాంభీర్యం కనిపించింది.
ఐటి దాడులు జరిగి రోజు మల్లారెడ్డి మాట్లాడిన మాటలకు మూడు రోజుల తర్వాత ఐటి అధికారులు వెళ్లిపోయిన తర్వాత మాట్లాడిన మాటలకు చాలా తేడా ఉందనేది అర్థం అవుతోంది. మొదట్లో కొంత ఇబ్బంది పడ్డ మల్లన్న ఆ తర్వాత తన స్వరాన్ని మార్చారు. ఐటి దాడులు బీజేపీ పుణ్యమేనని, తమ పార్టీ నేతల్ని వేధించేందుకే అనే మ్యాటర్ బయటికి వెళ్లేలా చెప్తున్నారు. ప్రగతి భవన్ డైరక్షన్ లోనే మల్లారెడ్డి మాట్లాడరనే విమర్శలు లేకపోలేదు. 30 ఏళ్లుగా విద్యాసంస్థలను నడుపుతున్న తమ కుటుంబంపై రాజకీయకక్షతోనూ ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పడమే కాదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఐటీ, ఈడీ దాడులు జరగడం లేదని ప్రశ్నించారు. కాషాయం కప్పుకుంటే చాలు ఇలాంటి కేంద్ర సంస్థల దాడులు ఉండవని చెబుతూ పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ దాడుల గురించి ముందే కెసిఆర్ చెప్పారన్న మల్లారెడ్డి ఆయన ఉన్నారనే ధైర్యంతోనే మేమున్నామని వివరణ ఇచ్చారు. అంతా కెసిఆర్ సారే చూసుకుంటాడని కూడా చెప్పడంతో ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఐటీ దాడుల నేపథ్యంలో సిఎం కెసిఆర్ అత్యవసర మీటింగ్ పెట్టారన్న విషయం తెలిసిందే. ఈ భేటీలో దాడులతో భయపడద్దని , ఏం జరిగినా నేను చూసుకుంటానని నేతలు, పార్టీ కేడర్ కి కెసిఆర్ భరోసా ఇచ్చారట. అంతేకాదు ప్రజల్లో ఈ విషయాన్ని ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కూడా బాధ్యత నాదేనని హామీ ఇవ్వడంతో గులాబీ నేతల్లో కాస్తంత ధైర్యం వచ్చిందట. ఆ మాటలే మంత్రి మల్లారెడ్డికి కూడా చెప్పడంతో ఆయన మీడియా సమావేశంలో దూకుడు చూపించారని చెబుతున్నారు. అంతేకాదు ఐటీ తీసుకెళ్లిన డబ్బుకి కూడా లెక్క ఎలా చెప్పాలన్న దానిపైనా క్లారిటీ ఉండటంతో బీజేపీ ఏమీ చేయలేదనే ధైర్యంతో ఉన్నారట మల్లారెడ్డి. టీఆర్ ఎస్ నేతలు ఈ దాడులకు ప్రతిదాడులు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు దాన్ని మరింత బలపరుస్తూ మంత్రి మల్లారెడ్డి కూడా కెసిఆర్ చూసుకుంటారని చెప్పడంతో రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ గొడవ ఏరూపంలో ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. దీంతో ఆయా పార్టీలు ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఘాటైన సమాధానాలు.
తన పార్టీ నేతల్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు పెడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రాష్ట్రప్రజలకు తెలియజేయాలనే డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కేంద్రం అనుసరిస్తున్న విధానాల కారణంగా ఏ రకంగా తెలంగాణ డెవలప్మెంట్ ఆగిపోయిందనే విషయాన్ని తెలియజేసే అవకాశం లేకపోలేదు. పనిలో పనిగా బీజేపీని తనదైన శైలిలో విమర్శించనున్నారు.