Tea Time MD Arjun Ganesh: ఆదిభట్లలో యువతి కిడ్నాప్ ఘటనతో మాకు సంబంధం లేదు: టీ టైమ్ మేనేజింగ్ డైరెక్టర్
BDS student Kidnapped in Adibhatla: ఆదిభట్లలో ఒక అమ్మాయి కిడ్నాప్ నకు సంబంధించి తమకు ఏ సంబంధం లేదని టీ టైం మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ గణేష్ స్పష్టం చేశారు.
BDS student Kidnapped in Adibhatla: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఒక అమ్మాయి కిడ్నాప్ నకు సంబంధించి తమకు ఏ సంబంధం లేదని టీ టైం సంస్థ వెల్లడించింది. బీడీఎస్ స్టూడెంట్ శుక్రవారం కిడ్నాప్ కాగా, ఆమెను టీ టైం సంస్థకు చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేశారని ప్రచారం జరగింది. దీనిపై టీ టైం మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ గణేష్ (Tea Time MD Arjun Ganesh) స్పందించారు. ఆదిభట్లలో జరిగిన యువతి కిడ్నాప్ సంఘటనలో వివిధ మీడియా సంస్థలలో తమ టీ టైమ్ పేరున వార్తలు ప్రచురించారని, ఈ వార్తల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదిభట్లలో ఏదైతే సంఘటన జరిగిందో దానికి గాని మా టీ టైం సంస్థకు గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఈ విషయంపై తాము ఎవ్వరి పైనా ఇప్పటివరకు ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు అన్నారు. కానీ 3500 అవుట్లేట్లతో ఎంతోమందికి ఉపాధి కలిగిస్తున్న తమ టీ టైం సంస్థపై తప్పుడు కథనాలు సోషల్ మీడియాలో, మీడియాలో అసత్యాలు ప్రచారం చేశారన్నారు. కనుక తాము మౌనంగా ఉంటే అది తమ సంస్థకు చెందిన వారి పనేనని ప్రజలు భావించే అవకాశం ఉందని, వివరణ ఇచ్చినట్లు టీ టైం ఎండీ అర్జున్ గణేష్ చెప్పారు. ఇలా అసత్య ప్రచారాలతో విలువ, నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉన్నందున సంస్థ డైరెక్టర్ గా ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని వివరణ ఇచ్చానన్నారు. ఇలా అవాస్తవ వార్తలను ప్రసారం చెయ్యొద్దు అని, దయచేసి వాస్తవాలను తెలుసుకుని విషయాన్ని ప్రసారం చేయాలని అన్ని మీడియా సంస్థలకి ఆయన విజ్ఞప్తి చేశారు.
కిడ్నాప్ కేసులో 32 మంది అరెస్ట్
ఆదిభట్ల పీఎస్ పరిధిలోని మన్నెగూడలో జరిగిన యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కిడ్నాపర్లు దాడి చేసిన సమయంలో వినియోగించిన రెండు వాహనాలను ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు సరూర్‌నగర్ లో స్వాధీనం చేసుకున్నారు. ఒక వాహనంలో పోలీసులకు సీసీ కెమెరాలు లభ్యమయ్యాయి. వాటిని సీజ్ చేశారు. యువతి కిడ్నాప్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి సహా 32 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు..
నవీన్ రెడ్డిని తాను ప్రేమించలేదని, ఫ్రెండ్ మాత్రమేనని.. అతడితో తనకు పెళ్లి కాలేదని ఆదిభట్లలో కిడ్నాప్ అయిన యువతి (బీడీఎస్ స్టూడెంట్) సంచలన విషయాలు వెల్లడించింది. చిన్నప్పటినుంచీ తన తల్లిదండ్రులు తనను కొట్టలేదని, కానీ నవీన్ రెడ్డి కొందరు యువకులతో తమ ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, ఆపై వాహనంలో దారుణంగా కొట్టారని తెలిపింది. శనివారం రాత్రి మీడియా ముందుకు వచ్చిన బాధిత యువతి.. తన కెరీర్ ఇక్కడితో ఆగిపోతుందని, కేసును దర్యాప్తు చేసి నిజాలు రాబట్టాలని పోలీసులను కోరారు. తాను చెప్పినట్లు వినకపోతే మా నాన్నను చంపేస్తామని బెదిరించారని బీడీఎస్ స్టూడెంట్ చెప్పింది.
కారులో హింసించాడు !
తనను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని వెళ్లాక.. జుట్టు పట్టి కొట్టాడని, మెడపై దాడి చేసి గాయపరిచాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. మెడ మెలి తిప్పి హింసించాడని, కాళ్లు కూడా మెలితిప్పి తీవ్రంగా హింసించారని కిడ్నాపర్ల చెర నుంచి బయటడపడ్డ యువతి తెలిపింది. తాను ప్రేమించకపోయినా సరే, నవీన్ రెడ్డి ప్రేమించినందుకు అతడ్ని వివాహం చేసుకోవాలని, కలిసుండాలంటూ వేధించాడని చెప్పింది. తనకు ఇష్టం లేకున్నా సరే అతడితోనే కలిసుండాలని డిమాండ్ చేస్తూ కుటుంబంపై దాడి చేసి కిడ్నాప్ చేశారన్నారు. ప్రాణ భయం ఉందని, పోలీసులతో తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరింది. పెళ్లి కాకున్నా వివాహం జరిగిందని నవీన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నాడని తన కెరీర్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.