Swapnalok Victims: స్వప్నలోక్ కాంప్లెక్స్ క్యూనెట్ బాధితుల ఆందోళన, న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరిక
Swapnalok Victims: స్వప్నలోక్ కాంప్లెక్స్ క్యూనెట్ బాధితుల ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరిస్తున్నారు.
![Swapnalok Victims: స్వప్నలోక్ కాంప్లెక్స్ క్యూనెట్ బాధితుల ఆందోళన, న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరిక Swapnalok Complex Q-Net Victims Protesting At Bashirbagh Police Station Swapnalok Victims: స్వప్నలోక్ కాంప్లెక్స్ క్యూనెట్ బాధితుల ఆందోళన, న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/18/df4dd8ca2a23b5625becd6c578f1ab1f1684416642712519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Swapnalok Victims: హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ముందు అగ్నిప్రమాదానికి గురైన స్వప్న లోక్ కాంప్లెక్స్ క్యూనెట్ బాధితులు ఆందోళన చేస్తున్నారు. రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ లాభాలు వస్తాయని ఒక్కొక్కరి వద్ద 2 లక్షల నుండి ఐదు లక్షలు కట్టించుకొని మోసం చేశారని వాపోతున్నారు. గత రెండు నెలలుగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. క్యూనెట్ ఆస్తులు 137 కోట్లను ఫ్రీజ్ చేశామని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారని.. కానీ ఇప్పుడు మేసం చేసిన వారికి బెయిల్ వచ్చిందని తెలిపారు. స్వప్న లోక్ కాంప్లెక్స్ ప్రమాదంలో ఆరుగురు తమ స్నేహితులు చనిపోయారని.. వారికి నష్ట పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని చెప్పారు. ప్రభుత్వం స్పందించి 300 మంది బాధితులమైన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. క్యూ నెట్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే?
ఆరుగురు నిరుపేద యువతీ యువకుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటన! ఈ ఫైర్ యాక్సిడెంటుపై కేసు నమోదు చేశారు మహంకాళి పోలీసులు. 49/2023 U/S 304 పార్ట్-II, 324, 420 IPC, సెక్షన్ 9 (B) పేలుడు పదార్థాల చట్టం, 1884 కింద కేసు ఫైల్ చేశారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ సూపర్‌వైజర్ ఇచ్చిన ఫిర్యాదుతో FIR నమోదు చేశారు. మార్చి 16వ తేదీ రాత్రి 7:15కు కాంప్లెక్సులో మంటలు చేలరేగాయి. KEDIA INFOTECH Ltd., VIKAS PAPER FLEXO Packaging Ltd., నుంచి మంటలు, పొగలు వస్తున్నట్లు తొలుత గుర్తించారు. ఈ రెండు ఆఫీసులు స్వప్నలోక్ కాంప్లెక్స్ 5వ అంతస్తు, B బ్లాక్‌లో ఉన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను ఆర్పి కొంతమందిని రక్షించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. చనిపోయిన ఆరుగురు పొగవల్లే ప్రాణాలు వదిలారని డాక్టర్లు తెలిపారు. భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన స్వప్నలోక్ సూర్యకిరణ్ ఎస్టాబ్లిష్మెంట్ అసోసియేషన్, కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్, వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకేజింగ్ లిమిటెడ్, క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా- సీఎం కేసీఆర్
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడటం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వుండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రులు మహమూద్ అలీ, తలసానిని సీఎం కేసీఆర్ సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)