Sri Tej Discharged: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ డిశ్చార్జ్
Sandhya Theater Incident: పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు డిశ్చార్జ్ అయ్యాడు. శ్రీతేజ్ కు 4 నెలల 25 రోజులపాటు వైద్యం అందించారు.

Hyderabad Latest News: సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. పుష్ప 2 సినిమా ప్రిమియర్ షో టైంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఫ్యామిలీ సినిమా చూడటానికి వెళ్లిన శ్రీతేజ్ ఫ్యామిలీ ఇరుక్కుంది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో తల్లి చనిపోయింది. తీవ్ర గాయాలు పాలైన శ్రీతేజ్ అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. తాజాగా డిశ్చార్జ్ అయ్యాడు.
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు వేశారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్, తన భార్య రేవతి, కుమారుడు శ్రీతేజ్ సంధ్య థియేటర్‌కు వెళ్లారు. భారీగా జనం రావడం, అదే టైంలో పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి అదే థియేటర్‌కు వచ్చాడు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది.
థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో భాస్కర్ భార్య రేవతి, కుమారుడు శ్రీతే చిక్కుకున్నారు. ఈ దుర్ఘటనలో రేవతి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా... కొనఊపిరితో ఉన్న శ్రీతేజ్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలు పాలైన శ్రీతేజ్‌ను సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స అందించారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శ్రీతేజ్ చావు అంచు నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉండటంతో బాలుడిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
శ్రీతేజ్‌ను ఇంకా కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆసుపత్రి నుంచి రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ పదిహేను రోజులు చికిత్స అందిస్తారు. అంటే ఫిజియోథెరపీ చేస్తారు. అనంతరం ఇంటికి పంపిస్తారు. శ్రీతేజ్‌కు 4 నెలల 25 రోజుల పాటు వైద్యులు చికిత్స అందించారు.
మనుషులను గుర్తు పట్టడం లేదని తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి పుష్ప 2 టీం, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభించిందని చెప్పారు. అయితే తన బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని కానీ తమను ఇంకా గుర్తు పట్టడం లేదని అంటున్నారు. తన చెల్లి ఆసుపత్రికి వచ్చి మాట్లాడుతున్నా శ్రీతేజ్ స్పందించడం లేదని వాపోయారు. ఇంకా ఆసుపత్రిలో ఉంటే కొన్ని ఇన్ఫెక్షన్‌లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారని తెలిపారు. ఫుడ్ తీసుకుంటున్నాడని అందుకే కంగారు పడాల్సిన పని లేదని వైద్యులు చెప్పినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఆసుపత్రి వర్గాలు తమకు డబ్బులు గురించి అడగలేదని డిశ్చార్జ్ టైంలో కూడా ఎలాంటి ఒత్తిడి చేయలేదని అన్నారు.





















