Sabarimala Special Trains: శబరిమలకు వెళ్తున్నారా? అయ్యప్ప భక్తుల కోసం స్పెషల్ రైళ్లు ఇవే
Ayyappa Devotees: అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపనుంది. సికింద్రాబాద్ నుండి కొల్లాం, కొట్టాయానికి ఈ రైళ్లు నడవనున్నాయి.
Ayyappa Devotees: అయ్యప్ప సీజన్ మొదలు అయింది. కార్తీక పౌర్ణమికి చాలా మంది అయ్యప్ప మాలలు వేసుకున్నారు. మండల కాలంపాటు అంటే 41 రోజులు దీక్ష తీసుకుంటారు. ఈ 41 రోజుల పాటు అత్యంత నియమ నిష్ఠలు పాటించి అయ్యప్పను పూజిస్తారు. 41 రోజుల అయ్యాక స్వాములు శబరి యాత్రకు వెళ్తారు. అలా శబరి వెళ్లే అయ్యప్ప దీక్షాపరులు, అయ్యప్ప స్వామి భక్తుల కోసం రైల్వే శాఖ గొప్ప సౌకర్యాన్ని కల్పించనుంది. ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుండి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా కొల్లాం, కొట్టాయానికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్లు తిరిగి కొల్లాం, కొట్టాయం నుండి సికింద్రాబాద్ కు నడుస్తాయని అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ - కొల్లాం (07117) ఈ నెల 20, డిసెంబర్ 4, 18, జనవరి 8 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్ (07118) ఈ నెల 22, డిసెంబర్ 6, 20, జనవరి 10 తేదీల్లో నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్ - కొల్లాం(07121) ఈనెల 27వ తేదీ, డిసెంబర్ 11, 25, జనవరి 1, 15 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్ (07122) ఈ నెల 29, డిసెంబర్ 13, 27, జనవరి 3, 17 తేదీల్లో నడవనున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే సికింద్రాబాద్ - కొల్లాం(07123) ఈ నెల 21, 28 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్(07124) ఈ నెల 23, 30 తేదీల్లో, సికింద్రాబాద్ - కొట్టాయం (07125) ఈ నెల 20, 27 తేదీల్లో నడవనున్నాయి. కొట్టాయం - సికింద్రాబాద్ (07126) ఈ నెల 21, 28 తేదీల్లో నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో శబరిమల అయ్యప్ప ఆలయం ఒకటి. శబరిమలకు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. అయితే ఎక్కువగా దక్షిణ భారతదేశానికి చెందిన వారు వెళ్తుంటారు. కార్తీక పౌర్ణమి నాడు చాలా మంది భక్తులు అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. వారు 41 రోజులు అయ్యాక సంక్రాంతి రోజున శబరిమలకు చేరుకుని అక్కడ జ్యోతి దర్శనం చేసుకుంటారు. తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకుని దీక్షను విరమిస్తారు.
దాదాపు అందరూ దేవుళ్లకు భక్తులు దీక్ష తీసుకుంటారు. అయితే అయ్యప్ప దీక్ష చాలా కఠినంగా ఉంటుంది. చలికాలంలో తెల్లవారుజామునే లేచి చలినీళ్లతో స్నానం చేయడం దగ్గరి నుండి చాలా నియమ నిష్ఠలు పాటించాల్సి ఉంటుంది. అయ్యప్ప దీక్షాపరులు ఉదయం సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం చలినీళ్లతో స్నానం చేయాలి. తర్వాత దీపారాధన చేసి పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్నం బిక్ష, రాత్రికి అల్పాహారం తీసుకోవాలి. అయ్యప్ప దీక్షాపరులు నలుపు వస్త్రాలు ధరించాలి. పాదరక్షలు ధరించకూడదు. దీక్షలో ఉన్న సమయంలో క్షవరం చేయుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం చేయకూడదని నియమం.
41 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్నానం చేసి గుడికి వెళ్లాలి. స్వామియే శరణం అయ్యప్ప అనే మంత్రాన్ని ఎల్లవేళలా పఠిస్తూ ఉండాలి. ఎదుటి వారిని స్వామి లేదా అయ్యప్ప అని సంభోదించాలి. ఇలా 41 రోజుల పాటు కఠిన నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.