Telangana News: సరోగసి కేసులో ఊహించని ట్విస్ట్, నోరువిప్పిన ఏ1 డాక్టర్ నమ్రత; ఏ పాపం తెలీదని వాదన
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సరోగసి కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ1గా ఉన్న డాక్టర్ నమ్రత మొటిసారి నోరు విప్పారు. నేనేం చేయలేదు.నన్ను కావాలనే ఇరికిస్తున్నారంటూ బోరుమన్నారు.

Telangana News: సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటి సెంటర్ అక్రమాలపై విచారణ చేపట్టిన మొదటిరోజే కొత్త ట్విస్ట్ ఎదురయ్యింది. 'సృష్టి' సరోగసి బాగోతం బయటకొచ్చిన నాటి నుంచి 'సృష్టి' నిర్వాకురాలు డాక్టర్ నమ్రతను మీడియా ఓ రేంజిలో ఉతికి ఆరేసింది. నమ్రత బాగోతం వరుస కథనాల రూపంలో దంచికొట్టింది. రంగలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితురాలు నమ్రతతోపాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరపరిచారు. నిందితులకు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. కేసులో కీలకంగా మారిన డాక్టర్ నమ్రత నుంచి వాస్తవాలు రాబట్టేందుకు, ఎంత మంది దంపతులను ఫెర్టిలిటి కోసం వస్తే సరోగసికి మళ్లించి, మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసింది, ఎంత మంది శిశువులను విక్రయించింది అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడంతోపాటు, ' సృష్టి' కేసులో ఇంకా మిగతా నిందితుల ప్రమేయం రాబట్టేందుకు కస్టడికి తీసుకుని విచారిస్తున్నారు. నమ్రతను 5రోజులపాటు పోలీసు కస్టడీకి న్యాయస్దానం అనుమతించడంతో, మొదటిరోజు విచారణ చేపట్టారు.
పోలీసులు విచారణ తరువాత చంచల్ గూడ జైలుకు తరలించే క్రమంలో మీడియాతో మాట్లడే ప్రయత్నం చేసింది నిందితురాలు డాక్టర్ నమ్రత. మీరు ఇంకా ఎంత మందిని ఇలా మోసం చేశారు, గాంధీ ఆసుపత్రి ఎనస్థీషియా డాక్టర్ సదానంద్‌కు ఈ కేసులో ఎంతవరకూ ప్రమేయం ఉందని అడుగుతున్న ప్రశ్నలకు స్పందించింది. నేను ఏం తప్పు చేయలేదు. నేను తప్పు చేయలేదంటూ చెప్పింది. "నేను శిశువిక్రయాలు చేయలేదు. రాజస్దాన్‌కు చెందిన సోనియా , గోవింద్ సింగ్ నాపై తప్పుడు కేసు పెట్టారు. శిశువును దత్తత తీసుకుంటామని, భార్యభర్తలు మాతో చెప్పే దత్తతకు శిశువును ఏర్పాటు చేశాం. భార్యభర్త మధ్య గొడవలు రావడంతో దత్తత విషయం చెప్పకుండా నాపై తప్పుడు కేసు పెట్టారు. ఫెర్టిలిటి కోసం వచ్చే దంపతులను సరోగసి వైపు మళ్లించి, లక్షల రూపాలయు వసూలు చేస్తున్నాననేది తప్పుడు ఆరోపణలు మాత్రమే. నేను ఎవరికీ శిశువులను విక్రయించలేదు. కోవిడ్ సమయంలో కూడా ఈ భార్యభర్తలు నన్ను ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు కూడా దత్తత విషయం చెప్పకుండా సరోగసి అంటూ నాపై తప్పుడు కేసులు పెట్టారు" అంటూ మీడియాతో మాట్లడే ప్రయత్నం చేసింది.
డాక్టర్ నమ్రత ఆరోపణలతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. మొత్తం మీరే చేశారని, అంతా కోడై కూస్తుంటే ,మీరు మాత్రం నన్ను కావాలనే ఇరికించారని దత్తత అంశం తెరపైకి తెచ్చారేంటి అంటూ ఒక్కసారిగా షాకయ్యారు. ఫెర్టిలిటీ సెంటర్లను షేక్ చేసి సికింద్రాబాద్ ' సృష్టి' సరోగసి వివాదంలో మోసం చేసి దంపతుల చిట్టా బయటపెడుతుందని అంతా అనుకుంటే , నేనేం చేయలేదని ఊహించని ట్విస్ట్ ఇచ్చింది నమ్రత.
ఒకవేళ రాజస్దాన్ దంపతులు శిశువు దత్తతకు కావాలని అడిగితే, ఏర్పాటు చేయాల్సిన అవసరం నమ్రతకు ఎందుకొచ్చింది. సరోగసి ద్వారా బిడ్డ కావాలంటే 30 లక్షలు అడిగింది? సెప్టెంబర్‌లో రాజస్దాన్ దంపతులను ఎందుకు విశాఖపట్నం పిలిచింది. 30లక్షలు నగదు ఎందుకు వసూలు చేసింది. కొడుకు న్యాయవాది అంటూ ఎందుకు బెదిరించింది. దత్తత తీసుకోవాలంటే అధికారికంగా ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ దత్తత తీసుకోవచ్చని తెలిసినా, డాక్టర్ నమ్రత భారీ మొత్తంలో డబ్బు ఎందుకు వసూలు చేసింది, ఈ మొత్తం వ్యవహారంలో డాక్టర్ నమ్రత కొడుకు జయంత్ ప్రమేయం ఎంత వరకూ ఉంది. ఇదిలా ఉంటే ఎనస్థీషియా డాక్టర్ గాంధీ నుంచి రోజూ ' సృష్టి' ఫెర్టిలిటీ సెంటర్‌కు వచ్చేవాడు? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నమ్రతపై ఉంది. మరో నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీ ఎదుర్కోనున్న వేళ ఏం చెప్పబోతుందనేది ఆసక్తిగా మారింది.





















