Vandebharat Train: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్‌లో ఇకపై కోచ్‌లు డబుల్ - రైల్వే శాఖ గుడ్‌న్యూస్
సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలుకు అత్యధిక డిమాండ్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో ఈ సెమీ-హైస్పీడ్ రైలు నడుస్తుంది.
సికింద్రాబాద్ - తిరుపతి మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు విషయంలో రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఆ రైలుకు ప్రస్తుతం ఉన్న కోచ్‌లను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలుకు అత్యధిక డిమాండ్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో ఈ సెమీ-హైస్పీడ్ రైలు నడుస్తుంది. ఈ కోచ్ ల సంఖ్యను 16కు పెంచనున్నారు.
అయితే, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో కోచ్‌ల సంఖ్య పెంచాలని అభ్యర్థనలు కూడా వచ్చాయి. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌తో చర్చించారు. మొత్తానికి కోచ్ ల సంఖ్య పెంచుతామని అంగీకరించడంతో కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ కూడా చేశారు.
ప్రస్తుతం 8 కోచ్ లతో నడుస్తున్న సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో 120 నుంచి 130 శాతం మేర ఆక్యుపెన్సీ రేషియో ఉంటోంది. చాలా మంది ప్రయాణికులకు రిజర్వేషన్లు కూడా దొరకట్లేదు. ఈ రైలులో వెళ్లాలనుకున్నా కుదరడం లేదు. తాజాగా రైల్వే బోర్డు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో కోచ్‌లను రెట్టింపు చేసేందుకు అంగీకరించింది.
టైమింగ్స్ ఇవీ
ఏప్రిల్ 9 నుంచి అందుబాటులోకి వచ్చిన సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైలు వారంలో 6 రోజులు నడుస్తుంది. ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న ప్రారంభించారు. తెలంగాణ, ఏపీకి చెందిన ప్రయాణికులు తిరుపతి పుణ్యక్షేత్రానికి అత్యంత వేగంగా చేరుకునేందుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు మంగళవారం తప్ప ప్రతి రోజూ రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణ సమయం 8.30 గంటలు అని రైల్వే అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్‌లో 11.30 గంటలకు ప్రారంభమై తిరుపతి 21.00 గంటలకు చేరుతుంది. ఆ మరుసటి రోజు నుంచి తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే రైలులో ప్రయాణికులను అనుమతిస్తారు. సికింద్రాబాద్ - తిరుపతి రైలు నెంబరు 20701. సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు రైలు ప్రారంభం అవుతుంది. తిరుపతికి మధ్యాహ్నం 14.30 గంటలకు చేరుతుంది. తిరుపతి - సికింద్రాబాద్ రైలు నెంబరు 20702.
సికింద్రాబాద్ - తిరుపతి మధ్య స్టాపులు ఇవే
నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29
తిరుపతిలో మధ్యాహ్నం 15.15కు రైలు ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్‌కు రాత్రి 23.45 గంటలకు చేరుతుంది.
మధ్యలో స్టాపులు ఇవీ
నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10
సెమీ హై స్పీడ్ ట్రైన్
వందేభారత్ రైలును పూర్తిగా ఇండియాలోనే తయారీ చేస్తున్నారు. దీన్ని సెమీ హై స్పీడ్ ట్రైన్‌గా పిలుస్తున్నారు. వందేభారత్‌కు ప్రత్యేక ఇంజిన్ ఉండదు. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, ఏసీ చైర్ కార్ వంటివి ఉంటాయి. తక్కువ విద్యుత్తును వినియోగించుకునేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ రైళ్లను స్టీల్‌తో కాకుండా తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో రూపొందిస్తున్నారు. వందే భారత్ ట్రైల్ రన్స్ సక్సెస్ అవుతుండటంతో.. త్వరలో వాటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతారు. ఇవి ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనున్నాయి. దేశంలో 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు గత కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు.