Rohit Reddy About ED: ఈడీ విచారణలో నేనే అధికారులను ప్రశ్నించాను, కానీ సమాధానం రాలేదు: MLA రోహిత్ రెడ్డి
ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను.. కానీ తనను ఇప్పటివరకు ఏ కేసులో విచారణకు పిలుస్తున్నారనేది ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.
ఈడీ విచారణకు ఎందుకు పిలిచిందో తనకు ఇప్పటికీ తెలియడం లేదన్నారు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. మంగళవారం ఉదయం మరోసారి విచారణకు రమ్మన్నారని, మళ్లీ మంగళవారం ఉదయం 10:30 కు విచారణకు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను అయ్యప్ప దీక్షలో ఉన్నాను అని, కొంత సమయం కావాలని కోరినట్లు చెప్పారు. డిసెంబర్ 31 వరకు సమయం కోరుతూ, తన పీఏ ద్వారా లెటర్ పంపినా, ఈడీ అధికారులు తన రిక్వెస్ట్ ను తిరస్కంచారని తెలిపారు. మూడు గంటలకు రావాలని నాకు సమాచారం ఇవ్వగా, దర్యాప్తు సంస్థల మీద ఉన్న గౌరవంతో తాను వచ్చానన్నారు. విచారణకు పిలిచిన ఈడీ అధికారులను రివర్స్ లో తానే కొన్ని ప్రశ్నలు అడిగానని కానీ సమాధానం దొరకలేదన్నారు. ఏ కేసులో పిలిచారు, ఎందుకు పిలిచారని పదే పదే తాను ప్రశ్నించిన ప్రయోజనం లేదన్నారు.
నేడు విచారణకు హాజరైన తనను వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకున్నారని, కుటుంబ వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను.. కానీ తనను ఇప్పటివరకు ఏ కేసులో విచారణకు పిలుస్తున్నారనేది ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదన్నారు. అయితే తన వ్యాపార వివరాలు, ఫ్యామిలీ వివరాలు అడిగగా, అన్ని వివరాలు ఈడీ అధికారులకు చెప్పినట్లు వెల్లడించారు.
కీలక గుర్తింపు పత్రాలు సమర్పించాను..
ఈడీ అధికారులు తనను విచారణకు ఎందుకు పిలిచారో తెలియదని, ఏ కేసులో విచారణ చేపట్టారో అధికారులు క్లారిటీ ఇవ్వలేదన్నారు. అయితే బాధ్యత గల పౌరుడిగా విచారణకు హజరై విచారణకు సహకరిస్తున్నట్లు చెప్పారు. ఈడీ అధికారులకు తన ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్, ఐడెంటిటీ కార్డు లు అన్ని సమర్పించానని తెలిపారు. దీనిపై మంగళవారం న్యాయవాదులతో లీగల్ ఒపీనియన్ తీసుకుంటానన్నారు. ఈడీ ముఖ్యంగా సోమవారం జరిపిన విచారణలో భాగంగా తన వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు మాత్రమే సేకరించడంపై ఫోకస్ చేసిందన్నారు. మరోసారి విచారణకు రావాలని ఈడీ సూచించగా, మంగళవారం సైతం విచారణకు హాజరు కానున్నట్లు మీడియాకు తెలిపారు.
మీడియాకు తాను ఏ ఫార్మాట్ అయితే ఇచ్చానో, అదే విషయంలో విచారణ జరిగిందన్నారు. విదేశీ పర్యటన, వ్యాపార లావాదేవీలపై ప్రశ్నలు అడిగారా అనే మీడియా ప్రశ్నకు బదులివ్వలేదు. విచారణలో ఈడీ అధికారులకు సహకరించి పూర్తి వివరాలు తెలిపానన్నారు. ఏ నేరానికి సంబంధించిగానీ, కేసుకుగానీ, ఆరోపణలపైగానీ, మనీ లాండరికింగ్ కు సంబంధించి విచారణకు పిలిచారా అని తాను ప్రశ్నించినా.. ఈడీ తనకు బదులివ్వలేదన్నారు.
డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి నోటీసులు
ED Notice To Rohit Reddy : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. రోహిత్ రెడ్డితో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 19న రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. తన వ్యక్తిగత, కుటుంబ, వ్యాపార వివరాలు మాత్రమే అడిగి ఈడీ సేకరించినట్లు సమాచారం.
ఆధారాల కోసం హైకోర్టుకు వెళ్లి మరీ తీసుకున్న ఈడీ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ గత ఏడాది విచారణ జరిపింది. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సైలెంట్ అయింది. అయితే పూర్తిగా కేసును విత్ డ్రా చేసుకోలేదు. తెలంగాణ పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలివ్వలేదని.. కోర్టుకు వెళ్లి.. ఆధారాల కోసం న్యాయపోరాటం చేశారు. హైకోర్టు పదే పదే ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఈడీకి అధారాలు ఇచ్చారు. ఈడీ అధికారులకు ఇచ్చిన సమాచారంలో..కోర్టుకు సమర్పించని కీలకమైన వాంగ్మూలాలు ఇతర డిజిటల్ ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటిని పరిశీలించి టాలీవుడ్ డ్రగ్స్ నిందితులకు ఈడీ ప్రత్యేకంగా నోటీసులు జారీ అవకాశాలు ఉన్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది. చాలా రోజుల ఆలస్యం తర్వాత ఇప్పుడు నోటీసులు జారీ చేయడం అనూహ్యంగా మారింది.