Revanth Reddy: రాష్ట్రంలో వరుసగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు - ఎప్పుడు, ఎక్కడి నుంచంటే?
Revanth Reddy: ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్, ఒకే రోజు 2 లక్షల ఉద్యోగాలని చెబుతూ బండి సంజయ్ ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy: టీఎస్పీఎస్సీ కేసు విచారణను రాష్ట్ర అధికారులు చేపడితే కేసులో నిజానిజాలు నిగ్గు తేలవని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ప్రభుత్వంలో పెద్దలను కాపాడుకునేందుకే ప్రభుత్వం సిట్ ను ఉపయోగించుకుందని ఆరోపించారు. ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోదీ నిరుద్యోగులను మోసం చేశారంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 22 కోట్ల 6 లక్షల దరఖాస్తులు వస్తే.. 7,22,311ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంటులో ప్రధాని సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా నిరుద్యోగులను మోసం చేసినట్లు ప్రధాని అంగీకరించారని తెలిపారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఒకే రోజులో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నాడని అన్నారు. బండి మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామన్నారని.. కానీ ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా అంటూ అధికారులు చేతులెత్తేశారని చెప్పుకొచ్చారు.
అసలు రాష్ట్రంలో ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో బండి సంజయ్ కు తెలుసా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్, ఒకే రోజు 2 లక్షల ఉద్యోగాలని బండి ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. ప్రజాక్షేత్రం నుంచి పార్లమెంట్ వరకు నిరుద్యోగుల కోసం కొట్లాడింది కాంగ్రెస్ అని చెప్పారు. బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి దగ్గర చేయాలన్నారు. ఈనెల 21వ తేదీన నల్గొండలో మాహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన చేపడతామన్నారు. ఈ నెల 24న ఖమ్మం జిల్లాలో, 26న ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
మే 4 లేదా 5న సరూర్ నగర్ లో నిరుద్యోగుల సమస్యలపై భారీ సభ నిర్వహిస్తామన్నారు. ఎల్బీ నగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి.. సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళ్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నట్లు వెల్లడించారు. ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదు.. నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటం అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నామన్నారు. మే 9 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో విడత కార్యక్రమం ఉంటుందని.. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ‘ఉమ్మడి హైదరాబాద్ బిడ్డ మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు అయ్యాక హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేపు కర్ణాటకలో , ఏడాది చివర్లో తెలంగాణలోనూ మనం అధికారంలోకి రాబోతున్నాం. ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుంది, కేంద్రంలో నరేంద్ర మోదీని, రాష్ట్రంలో కేసీఆర్ మెడలు వంచేలా పార్టీ శ్రేణులు పని చేయాలని’ పిలుపునిచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ భారత్ సత్యాగ్రహ సభలో సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కొత్త తరం నాయకులకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.