Revanth Reddy: నన్ను ఒంటరి చేసి అక్క అన్యాయం చేసింది - చిట్‌చాట్‌లో రేవంత్ ఆసక్తికర విషయాలు
Telangana News: తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై రేవంత్ రెడ్డి విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబిత, సునీత మహేందర్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
TS assembly Updates: బుధవారం (జూలై 31) నాడు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ బయట మీడియాతో చిట్ చాట్ చేశారు. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయంగా సబితక్క అని భట్టి క్లియర్ గా చెప్పారని అన్నారు. దానికి మించిన సమాధానం ఏముంటుందని మాట్లాడారు. సునీత లక్ష్మారెడ్డి కోసం ప్రచారం చేస్తే తనపై గతంలో రెండు కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేసుకున్నారు. కౌడిపల్లి, నర్సాపూర్ లో తనపై రెండు కేసులు ఉన్నాయని.. ఆ కేసుల చుట్టూ ఇంకా తిరుగుతున్నాని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, సునీత అక్క బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి పొందారని.. తనపై కేసులు మాత్రం అలాగే ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినందున వాళ్లపై మాత్రం కేసులు మాఫీ అయ్యాయని చెప్పారు.
2014లో సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఆమెకు టికెట్ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత నన్ను కాంగ్రెస్ లో చేర్చి సబిత అక్క బీఆర్ఎస్ లోకి వెళ్లింది. తమ్ముడినైన నన్ను ఒంటరిని చేసి అక్క అన్యాయం చేసింది. నేను నా పొలిటికల్ అనుభవాలు మాత్రమే చెప్పాను. బాధ్యత తీసుకుంటానని చెప్పి నాకు టికెట్ ప్రకటించగానే సబిత అక్క బీఆర్ఎస్ లోకి వెళ్లింది. మరి ఇప్పుడు అక్కలకు అన్యాయం జరిగితే కేసీఆర్, హరీశ్ రావు ఎందుకు రాలేదు.
సబితక్క ఆవేదన చూసి అయినా కేసీఆర్, హరీశ్ రావు సభకు రావాలి కదా? ఈ సభ చాలా ప్రజాస్వామ్య బద్ధంగా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ కు అస్సలు బాధ్యత లేదు. అధికారం ఉంటే సభకు వస్తానంటారు... లేదంటే రానని కేసీఆర్ అంటున్నారు. మరి కేటీఆర్, హరీశ్ రావు అసెంబ్లీలో సరిపోతారనుకుంటే.. కేసీఆర్ ఫ్లోర్ లీడర్ గా ఎందుకు? ఆయన్ను తొలగించవచ్చు కదా?
మేం బీఆర్ఎస్ నేతలకు కావాల్సినంత సమయం ఇచ్చాం. అయినా తమకు మాట్లాడేందుకు సమయం ఇవ్వలేదని వారు నిరసన చేస్తున్నారు. హరీశ్ రావు గంటకు పైనే మాట్లాడారు. కేటీఆర్ కు కూడా మాట్లాడేందుకు చాలా సమయం ఇచ్చాం. ఇంత సమయాన్ని వారు కూడా మేం ప్రతిపక్షంలో ఉండగా మాకు ఇవ్వలేదు. ప్రభుత్వం అన్ని రకాల చర్చలకు రెడీగా ఉంది. చర్చకు ఇవ్వాల్సినంత సమయం ఎప్పుడో ఇచ్చాం. భవిష్యత్తులో శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు అవ్వొచ్చు. మా సంపత్, వెంకట్ రెడ్డిల సభ్యత్వం రద్దు కాలేదా? ఇంకా గతంలో నన్ను సభకే రానివ్వలేదు’’ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు.