Bhatti Vikramarka: తాకట్టు బంగారాన్ని విడిపించి, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని పరుగులు పెట్టించారు పీవీ: డిప్యూటీ సీఎం భట్టి
పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని, ఆయన ఆర్థిక సంస్కరణలతో దేశం మళ్లీ ట్రాక్ లోకి వచ్చిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

PV Narasimha Rao Jayanthi | హైదరాబాద్: ప్రధాని ఇందిరాగాంధీ తీసుకువచ్చిన భూ సంస్కరణలను ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అమలు చేసిన సంఘసంస్కర్త పివి నరసింహారావు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ వద్ద శనివారం ఆయన నివాళులు అర్పించిన అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ప్రధాని, భారతరత్న, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ మన రాష్ట్రంలో జన్మించడం అందరికీ గర్వకారణం అన్నారు.
రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకువచ్చిన అనేక సంస్కరణలు సమాజానికి గొప్ప మేలు చేశాయి అన్నారు. అందరికీ ఒకే రకమైన విద్యాబోధన ఉండాలని ఈ దేశ మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ప్రజాస్వామ్య భావనకు పునాదులు వేశారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. పివి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉందని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆయన ఈ దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను గాడిలో పెట్టారని తెలిపారు.
భారత్‌ను బలమైన దేశంగా నిలిపారు..
తాకట్టులో ఉన్న దేశ బంగారాన్ని విడిపించి ఆర్థిక సంస్కరణలతో ప్రపంచంలో భారతదేశం ఒక బలమైన దేశంగా నిలబెట్టారని తెలిపారు. కాంగ్రెస్ పాలన కాలంలో 24 లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో పేదలకు పంపిణీ చేసిన భూములను గత 10 సంవత్సరాలు పరిపాలించిన వారు ధరణి పేరుతో రకరకాల ఇబ్బందులకు గురిచేసి పేదల భూములను అన్యాక్రాంతం చేశారని విమర్శించారు. నాడు పంచిన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదల అస్తిత్వాన్ని, హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని వివరించారు. పీవీ నరసింహారావు మార్గాన్ని ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా అమలు చేస్తుందని, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

పీవీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి
మాజీ ప్రధాన మంత్రి , భారతరత్న పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. బహుభాషాకోవిదుడి గా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా తెలుగు వ్యక్తి అయిన పీవీ దేశానికి ఎనలేని సేవలను అందించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో పీవీ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేంద్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సత్తుపల్లి మట్టా రాగమయి ,టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.























