PV Narasimha Rao Jayanthi: తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు జయంతి- నివాళులర్పించిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు, తదితర ప్రముఖులు
PV Jayanti 2025 | దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పలువురు నేతలు నివాళులర్పించారు.

PV Narasimha Rao Birth Anniversary | హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతిని పురస్కరించుకుని ఏపీ, తెలంగాణ నేతలు, జాతీయ నేతలు పార్టీలకతీతంగా నివాళి అర్పిస్తున్నారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు. నిరాడంబర జీవితానికి నిలువెత్తు నిదర్శనం, సొంత భూములు పంచిపెట్టి భూసంస్కరణలను ప్రవేశపెట్టిన మహనీయుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. నేడు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని నివాళి అర్పించారు.
పీవీ తెలుగు ఠీవీ. దేశ ఆర్ధిక ప్రగతికి పునాది వేసిన రాజనీతిజ్ఝుడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పీవీని విస్మరించాయి. ఆఖరికి పీవీ అంత్యక్రియలు కూడా సరిగా నిర్వహించకుండా అవమానించింది కాంగ్రెస్. కేవలం ఎన్నికలప్పుడే పీవీ పేరును వాడుకుని వదిలేసిన పార్టీ బీఆర్ఎస్. ఇప్పటివరకూ పీవీ విజ్ఝాన వేదికను ఏర్పాటు చేయకపోవడం శోచనీయం’ అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళి
ఆర్థిక సంస్కరణలతో దేశానికి ప్రగతి బాటలు వేసిన దార్శనికుడు, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. #PVNarasimhaRao
అఖండ భారతాన్ని ఏలిన తొలి తెలుగుతేజం తెలంగాణ ముద్దు బిడ్డ శ్రీ పి.వి. నరసింహా రావు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు..#PVNARSIMHARAO pic.twitter.com/mveV3zRBfS
— Revanth Reddy (@revanth_anumula) June 28, 2025
ఏపీ సీఎం చంద్రబాబు నివాళి
మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయలో ప్రధాని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారని కొనియాడారు. తన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ గతినే మార్చేశారని దివంగత ప్రధాని పీవీ నరసిహారావు సేవల్ని గుర్తుచేసుకున్నారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు. ఆ మహనీయుడి స్మృతికి మరొక్క మారు నివాళి… pic.twitter.com/8yk7TXifZK
— N Chandrababu Naidu (@ncbn) June 28, 2025
తెలుగువాడి ఠీవీ పీవీ.. భారతరత్నంగా గుర్తింపు
హైదరాబాద్: దక్షిణ భారతదేశం నుంచి తొలి ప్రధాని తెలుగు వ్యక్తి అయ్యారు. తన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జయంతి నేడు. పాములపర్తి వెంకట నరసింహారావు (28 జూన్ 1921) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. 1991 నుండి 1996 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా సేవలు అందించారు. నెహ్రు ఫ్యామిలీ కాకుండా ప్రధాని పదవిలో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న తొలి నేతగా రికార్డు. 1991 లో ఆర్థిక సంక్షోభంతో ఆర్థిక సరళీకరణ, తన ప్రణాళికలతో దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన పీవీ.. కేంద్ర ప్రభుత్వంలో రక్షణ, హోం వ్యవహారాలు, విదేశాంగ వ్యవహారాలు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004, డిసెంబర్ 23 న పీవీ కన్నుమూశారు. భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం (మరణానంతరం) పీవీకి 2024 ఫిబ్రవరి 9న ప్రకటించింది.






















