Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Telangana News| కేసీఆర్ పాలన వల్లే తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెంది, భూముల ధరలు పెరిగాయని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో భూముల విలువ పెరగడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి చేశారని.. అందువల్లే భూముల ధరలు పెరిగాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లిన కనీసం ఎకరం ధర రూ.15 నుంచి రూ.20 లక్షలకు ఎక్కడా తక్కువ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మార్పు అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. కానీ వాళ్లు అధికారంలోకి రాగానే హైదరాబాద్ లో, రాష్ట్రంలో భూముల ధరలు తగ్గాయని.. అందుకు వారి చేతకాని పరిపాలనే కారణం అన్నారు. శ్రీనగర్ కాలనీలో తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ సమావేశంలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించారు.
భూమి ధర తగ్గుతుందని ప్రచారం
తెలంగాణ ఎన్నో భూ ఉద్యమాలకు కేంద్రంగా ఉంది. భూమి కోసం జరిగిన పోరాటాలు తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు. భూమి ధర చాలా ఎక్కువగా ఉంటుంది కనుకే ఎన్నో పంచాయితీలు జరుగుతాయి. టీఆర్ఎస్ (brs ) పార్టీకి మొదట్లో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతంలో అంత తేలికగా పట్టు దొరకలేదు అన్నారు. తెలంగాణ ఏర్పడితే భూముల ధరలు తగ్గుతాయని ఉమ్మడి ఏపీలో బాగా ప్రచారం చేశారు. తెలంగాణ ఏర్పడితే భూముల విలువ పెరుగుతదంటే ఆ సమయంలో మా మాటలు ఎవరు నమ్మలేదు. రాష్ట్రాన్ని నడపటం తెలంగాణ వారికి తెలియదు, అంత సామర్థ్యం ఉందా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. మత ఘర్షణలకు, నక్సలిజం, భూముల ధరలు పడిపోవటం లాంటి సమస్యలు వస్తాయని ప్రచారం చేశారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
గతంలో బంగారం బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుండేవారు. కానీ గత కొన్నేళ్లుగా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్లు భూమి మీద పెట్టుబడి లాభాలు పొందారు. తెలంగాణ ఏర్పడితే భూముల ధరలు తగ్గుతాయని అనుమానంతో రాష్ట్ర ఏర్పాటుకు వాళ్లు భయపడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు.
మా తాతకు కూడా వందల ఎకరాలు ఉన్నా, నీళ్లు లేకపోవటంతో భూమికి ఎలాంటి విలువ లేకుండా పోయింది. ఎంత పెద్ద భూస్వామి అయినా భూమికి విలువ లేక, బంగారం కుదవ పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. కేసీఆర్ ఈ విషయాలు గమనించి నీళ్లు ఇచ్చారు. అందువల్లే కేసీఆర్ పాలన తర్వాత తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన సరే ఎకరానికి రూ. 15 -20 లక్షలు అయ్యింది. భూమి విలువ పెరిగితే భూ యజమానికి భరోసా ఉంటుందన్నారు.
భూముల ధరలు ఎందుకు పెరగడం లేదు
కాంగ్రెస్ నేతలు చెప్పింది నిజం అయితే, ఈ ఏడాది ఎందుకు డెవలప్‌మెంట్ జరగటం లేదణి.. భూముల ధరలు ఎందుకు పెరగడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని రైతులు, ప్రజలు చెబుతున్నారు. వాళ్ల పార్టీ నాయకులే కాంగ్రెస్ చేసిన మోసాలను బయట పెడుతున్నారు అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నేతల అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో భూముల ధరలు పెరగడానికి బదులుగా, తగ్గుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అమలు చేయలేని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని విమర్శించారు.