Rangareddy: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా జేసీ- ఇంట్లోనూ తనిఖీలు భారీగా నగదు స్వాధీనం
Telangana: రైతుల నుంచి లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన జేసీ, సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు. రెండు రోజులుగా శ్రమించి ఇద్దర్నీ రెడ్‌హ్యాండెడ్‌గా పటుకున్నారు అధికారులు.
ACB Raids : ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో ఉన్న భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతోపాటు కలెక్టరేట్‌లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్ రెడ్డి కూడా అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఓ వ్యక్తికి చెందిన భూమి నిషేధితజాబితాలో ఉంది. దాన్ని నార్మలైజ్ చేసి నిషేధిత జాబితా నుంచి తప్పించేలా ధరణి పోర్టల్‌లో మార్పులకు రిక్వస్ట్ పెట్టుకున్నారు. ఈ పని చేసేందుకు ఆయన డబ్బులు డిమాండ్ చేశారు.
లంచం డిమాండ్ చేస్తున్న విషయాన్ని బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అధికారులు వల పన్ని 8 లక్షలు బాధితుడి నుంచి భూపాల్ రెడ్డి తీసుకుంటుండగా పట్టుకున్నారు. తన వద్ద పని చేసే సీనియర్ అసిస్టెంట్ ద్వారానే ఈ తతంగం నడిపించారు. ఇలా డబ్బులు చేతులు మారుతుండగానే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దర్నీ అరెస్టు చేశారు.
ఈ కేసుతో భూపాల్ రెడ్డి నివాసంలో కూడా అధికారులు తనిఖీలు చేశారు. నాగోల్‌లో ఉన్న ఆయన ఇంటిలో సోదాలు చేసి 16 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు కీలక పత్రాలు కూడా సీజ్ చేశారు.
లంచం తీసుకోవడం తప్పని ఏదోలా తప్పించుకుంటామంటే మాత్రం కుదరదని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. రెండు రోజుల నుంచి తీవ్రంగా శ్రమించి ఇద్దర్నీ పట్టుకున్నారని సిబ్బందిని అభినందించారు.