నా ఫోన్‌ను మోదీ ట్యాప్ చేశారు- నాకంటే ముందే నా ఫైల్స్ చదువుతున్నారు - కేటీఆర్ సంచలన ఆరోపణలు
ఆంధ్రాలో పోటీ అంశంపై కేటీఆర్ స్పందించారు. జగన్‌తో మాట్లాడారా అనే అంశంపై కూడా తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో చాలా విషయాలు మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను మోదీ ట్యాప్ చేశారన్నారు. తన ఫోన్‌కు వచ్చిన ఫైల్స్‌ను తనకంటే ముందే వాళ్లు చదువుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తన ఒక్కడికి సంబంధించిన అంశం కాదని... దేశంలో చాలా మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నారు. పెగాసెస్‌ను పదివేలకుపైగా ఫోన్లకు పంపించి ట్యాప్ చేస్తున్నారన్నారు. అన్నింటినీ వాళ్లు చూస్తున్నారని ఆరోపించారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఈ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కేటీఆర్.
ప్రధానమంత్రి కాదు ప్రచారమంత్రి
మోదీ ప్రధానమంత్రి కాదని... ప్రచార మంత్రి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేటీఆర్. మన్ కీ బాత్ తప్ప.. జన్ కీ బాత్ ఆయనకు పట్టదని ఎద్దేవా చేశారు. మోదీ అధికారులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మూడు ఘనతలు సాధించిందని సెటైర్లు వేశారు. 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం, 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం, ఎప్పుడూ లేనంత LPG రేట్‌లు పెంచిందని విమర్శలు చేశారు. వాళ్లు చెప్పినట్టు సెప్టెంబర్ 17 విమోచనం అయితే ఆగస్టు15 ఎందుకు విమోచనం కాదని ప్రశ్నించారు. భారత్ కూడా బ్రిటిష్ నుంచి విముక్తి పొందింది కదా అని నిలదీశారు. ఇక్కడ ముస్లిం కింగ్ ఉన్నాడనే ఇలాంటి ప్రచారం తెరపైకి తీసుకొచ్చారన్నారు.
వేటకుక్కల్లా ఈడీ, సీబీఐ
ఈడీ, సీబీఐ బీజేపీ అనుబంధ విభాగాలుగా మారాయని ఆరోపించారు కేటీఆర్. తమపైన కూడా కుట్ర జరుగుతోందన్నారు. మీడియా ఇప్పుడు మోడియాగా మారిపోయిందని నిజాలను రాసే ధైర్యం మీడియాకు లేదన్నారు. ఈడీ సీబీఐ వేట కుక్కల్లా మారాయని సీరియస్ కామెంట్స్ చేశారు. బీజేపీలో చేరిన వాళ్ళు పునీతులు అవుతారని.. లేకుంటే ఈడీ, సీబీఐ మీద పడతాయన్నారు. ఏడెళ్ళ జరిగిన ఈడీ దాడులే నిదర్శనమన్నారు. రాహుల్, సోనియా, మమత, సంజయ్ రౌత్ ఎవర్నీ వదల్లేదన్నారు.
మునుగోడు మాదే
మునుగోడులో 12 శాతం మార్జిన్‌తో విజయం సాధిస్తామన్నారు కేటీఆర్. బీజేపీలో చేరిన కారణంగా రాజగోపాల్ రెడ్డికి 22 వేల కోట్ల కాంట్రాక్ట్ దక్కిందన్నారు. అందులో 500 కోట్లు మునుగోడులో ఖర్చు పెడతానని అమిత్ షాతో ఒప్పందమ్ చేసుకున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ బలుపు, మునుగోడు ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని అభిప్రాయపడ్డారు కేటీఆర్. ప్రశాంత్ కిశోర్ టీం బీఆర్‌ఎస్‌తో పని చేస్తుందా లేదా అనే ప్రశ్నకు కేటీఆర్ సూటిగా సమాధానం ఇవ్వలేదు. కొంతవరకూ పనిచేస్తున్నారు అని దాటవేశారు.
కేసీఆర్ తెలియని వాళ్లు ఎవరు?
బీఆర్‌ఎస్‌కు ఇంకా గుర్తింపు రాలేదన్నారు కేటీఆర్. జాతీయ పార్టీ గుర్తింపు కోసం 3 రూల్స్ ఉన్నాయని వాటికి అనుగుణంగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. కారు గుర్తును వేరే రాష్ట్రాల్లో ఎవరికీ ఇవ్వొద్దని రిక్వస్ట్ చేసినట్టు తెలిపారు. వచ్చే కర్ణాటక, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ స్కీమ్ లను చూసి... రాయచూరు, నాందేడ్ ప్రాంతాల వాళ్ళు తమను తెలంగాణలో కలపాలి అని అడుగుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు, ఆంధ్రాలో పోటీ అంశంపై జగన్‌తో మాట్లాడారా అనే అంశంపై కూడా కేటీఆర్ సమాధానం దాట వేశారు. కెసిఆర్ తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
2024 టార్గెట్‌గా ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ చేశామన్నారు. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని తెలిపారు. గుజరాత్‌ది గోల్ మాల్ మోడల్ అని దేశానికి తెలంగాణా మోడల్ అందిస్తామన్నారు. తమ రైతు బంధు దేశానికి ఆదర్శమని... ప్రతీ ఇంటికీ నీరు ఇచ్చామని తెలిపారు. ఫ్లోరోసిస్ ఫ్రీ తెలంగాణ తీసుకొచ్చామని చెప్పారు. రైతు బంధును 13 రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని గుర్తు చేశారు కేటీఆర్.
కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాటం చేస్తోందని విమర్శించారు కేటీఆర్. రాహుల్ యాత్ర స్టార్ట్ చేయగానే గోవాలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారని... రాజస్థాన్‌లో సమస్యలు వచ్చాయని గుర్తు చేశారు. రాహుల్ యాత్ర వల్ల తెలంగాణలో వచ్చే మార్పులు ేమీ ఉండబోవన్నారు.