Plots Auctions: హైదరాబాద్ శివారులో మరోసారి భూముల వేలం, 3 జిల్లాల్లో 26 చోట్ల
Plots Auctions: హైదరాబాద్ శివారులో భూములను ప్రభుత్వం మరోసారి వేలానికి పెట్టింది. ఈ నెల 18వ తేదీన ఈ వేలం జరగనుంది.
Plots Auctions: హైదరాబాద్ లో భూముల వేలానికి అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో మరోసారి భూముల వేలానికి రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. డిమాండ్ కు అనుగుణంగా ప్లాట్లను ఈ వేలంలో అమ్మకానికి పెడుతోంది. నేరుగా ప్రభుత్వమే వేలం నిర్వహిస్తుండటంతో.. చిక్కుల్లేని, అన్ని రకాల అనుమతులు కలిగిన, సంపూర్ణమైన భూ యాజమాన్య హక్కులు ఉండటంతో ప్రభుత్వ భూ వేలానికి అద్భుతంమైన స్పందన వస్తోంది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ శివారు కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. సర్కారు అధికారులు, రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా ఊహించని రీతిలో ఆ వేలానికి రెస్పాన్స్ రావడంతో.. సర్కారు ఖజానాకు ఢోకా లేకుండా పోయింది. పారదర్శకంగా ఈ వేలం జరుగుతుండటంతో వేలానికి సాధారణ ప్రజల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో భూముల విక్రయానికి తాజాగా హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రంగారెడ్డి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్లాట్ల విక్రయం
రంగారెడ్డి జిల్లాలోని బైరాగిగూడ, మంచిరేవుల, పీరం చెరువు, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్, చందానగర్ లో ప్లాట్లను విక్రయించనుంది సర్కారు. మేడ్చల్ లో బాచుపల్లి, బౌరంపేట, చెంగిచర్ల, సూరారం, సంగారెడ్డిలో వెలిమల, నందిగామ, అమీన్ పూర్, రామేశ్వరం బండ, పతిఘన్ పూర్, కిష్ణారెడ్డి పేటలో స్థలాలు విక్రయించనుంది. కాగా ఈ నెల 16వ తేదీన రిజిస్ట్రేషన్లు స్వీకరించనుంది. ఒక్కో ప్లాటుకు ఈఎండీ రూ. 5 లక్షలు, ఈఎండీ చెల్లింపునకు చివరి తేదీ 17 ఆగస్టు. 18వ తేదీన రెండు సెషన్ లలో ఈ వేలం నిర్వహించనున్నారు అధికారులు. స్థల సందర్శన, వివరాలకు హెచ్ఎండీఏ వెబ్ సైట్‌లో బ్రోచర్ ను చూడవచ్చు. అలాగే వేలం పాడే సమయంలో కనీస బిడ్ పెంపుదల (చదరపు గజానికి) రూ. 1000 చొప్పున పెంచుకోవచ్చు.
రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్ 5, 430, 44, 144, 161, 188, 174, 89 సర్వే నంబర్లలో స్థలాన్ని విక్రయించనున్నారు. అలాగే మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని సర్వే నంబర్ 363, 425, 694, 130, 33/1, 166, 167 సర్వే నంబర్లలోని స్థలాను విక్రయానికి ఉంచారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 507, 823(పి 1), 823 (పి 2), 823 (పి 3), 250, 227, 273, 281, 177 సర్వే నంబర్లలోని స్థలాన్ని విక్రయానికి ఉంచారు.
హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం
హైదరాబాద్ లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లను మరోసారి వేలం వేసేందుకు సిద్ధం అయింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA) ప్రభుత్వ స్థలాల్లో అభివృద్ధి చేసిన మరికొన్ని ప్లాట్లను విక్రయానికి పెట్టింది. హైదరాబాద్ శివార్లలోని బాచుపల్లిలో 133 ప్లాట్లు, మేడిపల్లిలో 85 ఫ్లాట్లకు వచ్చే నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో వేలం నిర్వహించనున్నారు. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని బాచుపల్లిలో 27 ఎకరాలు, మేడిపల్లిలో 55 ఎకరాల ప్రభుత్వ స్థలంలో హెచ్ఎండీఏ భారీ లే అవుట్లను అభివృద్ధి చేసింది. మార్చిలో మొదటి విడత కింద కొన్ని ప్లాట్లను విక్రయించగా కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో తాజాగా రెండో విడత కింద రెండు లే అవుట్లలోని ప్లాట్లను విక్రయించేందుకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ను జారీ చేసింది. బాచుపల్లిలో చదరపు గజానికి రూ.25 వేలు, మేడిపల్లిలో రూ.32 చొప్పున ఉండాలని నోటిఫికేషన్ లో సూచించింది. మరింత సమాచారం కోసం హెచ్ఎండీఏ వెబ్ సైట్, ఎంఎస్ టీసీ ఈ కామర్స్, ఎంఎస్టీసీ ఇండియా వెబ్ సైట్లను సంప్రదించాలని తెలిపింది. లేఅవుట్ ల సందర్శనకు, సందేహాల నివృత్తి కోసం 7396345623, 915484321 నంబర్లకు సంప్రదించాలని అధికారులు తెలిపారు.