Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Lagacharla Attack Case | వికారాబాద్ లగచర్లలో కలెక్టర్, ఉన్నతాధికారులపై దాడికి ప్రోత్సహించింది పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ ప్రజలను, రైతులను రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
Parigi DSP Transferred in Lagacharla Incident in Vikarabad district | హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో డీఎస్పీ పై బదిలీ వేటు వేశారు. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతరం వికారాబాద్ జిల్లా పరిగి నూతన డీఎస్పీగా శ్రీనివాస్ చార్జ్ తీసుకున్నారు.
ప్లాన్ ప్రకారమే జరిగిన దాడి
లగచర్ల దాడి కేసులో మరో కొత్తకోణం వెలుగు చూసింది. ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని చెప్పడానికి విచారణలో కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ ఈ ఘటనలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలం సంగయ్యపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ ను వికారాబాద్ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కలెక్టర్, అధికారులపై దాడి చేయాలని లగచర్ల గ్రామానికి చెందిన రాఘవేందర్ గ్రామ ప్రజలు, రైతులను రెచ్చకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. లగచర్ల దాడి కేసులో కోర్టు ఇప్పటికే రిమాండ్ విధించింది.
సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో రైతుల ఆగ్రహం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్(Kodangal)లోని లగచర్లలో ఉన్నతాధికారులపై దాడి ఘటన కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇదివరకే ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను ప్రధాన కుట్రదారుడిగా గుర్తించి ఏ 1గా రిమాండ్ రిపోర్టులో చేర్చారు. మొదట ఏ1గా ఉన్న బోగమోని సురేష్ ను ఏ2గా పోలీసులు పేర్కొన్నారు. అయితే అధికారుల దాడిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ రావడం, పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి సురేష్ ఆచూకీ తెలియడం లేదు. సురేష్ ను జాడ అన్వేషించి వెతికి పట్టుకునేందుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు. కాగా, అల్లుడు డైరెక్టర్ గా ఉన్న ఫార్మా కంపెనీకి భూములు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి తమ భూములు తీసుకోవాలని చూస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. భూములు లేని వారు సైతం ఆందోళనకు దిగి, అధికారులపై దాడి చేయడం కచ్చితంగా కుట్ర కోణమే అని ప్రభుత్వం చెబుతోంది.
లగచర్లలలో రైతుల వద్దకు మాట్లాడేందుకు కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు గత వారం వెళ్లగా.. నినాదాలు చేసిన రైతులు, కొందరి అల్లమూక అధికారులపై దాడికి దిగింది. పెద్ద రాళ్లు కార్లు, వాహనాలపై వేసి ధ్వంసం చేశారు. లగచర్లలో అధికారులపై దాడి కేసులో పోలీసులు 25 మందిని అరెస్టు చేయగా.. వారం దాటినా ప్రధాన నిందితులలో ఒకడైన బోగమోని సురేష్ ఆచూకీ తెలియకపోవడంపై పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఉద్దేశపూర్వకంగానే సురేష్ ను కొందరు దాచిపెట్టి ఉంటారని భావించిన పోలీసులు అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
Also Read: Hyderabad Tourism News: వీకెండ్‌లో రామప్ప, లక్కవరం టూర్- తెలంగాణ పర్యాటక శాఖ స్పెషల్ ప్యాకేజీ