Jail Prisoner: సినిమా స్టైల్లో స్కెచ్, కడుపులో మేకులు, టేపు, బ్లేడ్లు
Osmania Doctors: జైలు నాలుగు గోడల మధ్య ఉండలేక ఓ ఖైదీ జైలు తప్పించుకోవడానికి స్కెచ్ వేశాడు. సినిమాల్లో చూపించే విధంగా ప్లాన్ చేశాడు. అయితే అదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది.
Chanchalguda Jail Prisoner: జైలు నాలుగు గోడల మధ్య ఉండలేక ఓ ఖైదీ జైలు తప్పించుకోవడానికి స్కెచ్ వేశాడు. సినిమాల్లో చూపించే విధంగా ప్లాన్ చేశాడు. సినిమాల్లో అనారోగ్యంగా ఉందని చెప్పి ఆస్పత్రికి వెళ్లి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు కదా! అదే స్టైల్లో నిజ జీవితంలో ఓ ఖైదీ తప్పించుకోవాలని వ్యూహ రచన చేశాడు. టేపులు, మేకులు, ప్లాస్టిక్ వస్తువులు మింగేశాడు. అయితే అదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది.
జైలు నుంచి తప్పించుకోవాడికి ఓ ఖైదీ చేసిన పని తెలిస్తే అవాక్కవాల్సిందే. డైలీ కడుపు నొప్పితో బాధపడుతున్నాడని ఖైదీని ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు, జైలు అధికారులకు దిమ్మ తిరిగి విషయాలు తెలిశాయి. సదురు ఖైదీ కడుపులో ఏకంగా ఎనిమిది రకాల లోహాలు ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. వివరాలు.. చంచల్‌గూడ జైలులో 21 ఏండ్ల మహమ్మద్ సొహైల్ ఖైదీగా ఉన్నాడు. ఆయన కొద్ది కాలంగా కడుపునొప్పితో బాధడుతున్నాడు. దీంతో డాక్టర్లు ఆయన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
జనరల్ సర్జరీ విభాగం యూనిట్-7 ప్రొఫెసర్ డాక్టర్ బొంగు రమేశ్ రోగిని పర్యవేక్షించి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి రిఫర్ చేశారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్ రమేశ్ కుమార్ రోగికి ఎక్స్‌రే తీయించగా అందులో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఖైదీ కడుపులో మేకులు, ప్లాస్టిక్ వస్తువులు, మెటల్ ఉన్నట్లు గుర్తించారు. సుమారు గంట పాటు శ్రమించి ఎండోస్కోపి సహాయంతో కడుపులో ఉన్న 8 రకాల మెటల్స్‌ను తొలగించి అతని ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని ఆరోగ్యం ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఖైదీ కడుపులో ఉన్న టేపులు, మెటల్ నెయిల్స్‌ను విజయవంతంగా తొలగించిన వైద్యుల బృందాన్ని ఉస్మానియా హాస్పిటల్ సూపరిడెంట్ నాగేంద్ర అభినందించారు. జైలులో నాలుగు గోడల మధ్య ఉండలేక ఎలాగైన బయటపడాలని సోహైల్ వాటిని మింగినట్లు తెలుస్తోంది. అయితే, అది కాస్త అతని ప్రాణం మీదకు వచ్చింది.
గత ఏడాది ఇలాంటి ప్లాన్
గత ఏడాది మేనెలలో చర్లపల్లి జైలులో ఇదే తరహాలో ఓ ఖైదీ తప్పించుకున్నాడు. అయితే పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. అత్యాచారం కేసులో చర్లపల్లి జైలులో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన ఐతం రవి శంకర్ శిక్ష అనుభవించేవాడు. అతనిపై తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 40 కేసులు ఉన్నాయి.
జైలులో తోటి ఖైదీ శ్రీధర్ బంధువులతో పరిచయం పెంచుకుని ఎస్కేప్‌కి పక్కా ప్లాన్ వేశాడు. మిర్యాలగూడ కోర్టుకు వస్తానని, వారిని అక్కడికి రావాలని కోరాడు. కోర్టుకు వచ్చాక తన ఫ్రెండ్స్ తో మాట్లాడతానని రవిశంకర్ పోలీసులను రిక్వెస్ట్ చేశాడు. పోలీసులు అంగీకరించడంతో ముందే అనుకున్న ప్లాన్‌ను అమలు చేశాడు. వారితో మాట్లాడుతున్నట్లు నటిస్తూ పక్కనే ఉన్న కారులోకి ఎక్కేసి అద్దంకి రోడ్ పారిపోయాడు.
షాక్ నుంచి తేరుకున్న పోలీసులు స్థానిక పోలీసులకు విషయం చెప్పి అలెర్ట్ చేశారు. ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఒంగోలు, చెన్నై హైవేపై నిఘా పెట్టారు. మల్లూరు ప్రాంతం వద్ద రవిశంకర్‌ను గుర్తించారు. దాదాపు ఏడు కిలోమీటర్లు చేజ్ చేసి టంగుటూరు టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.