Sharmila Bail Petition: షర్మిల బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు, నాంపల్లి కోర్టు తీర్పు వాయిదా
వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. ఈ రోజు సాయంత్రం లోపు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం రిమాండులో ఉన్న వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. ఈ రోజు సాయంత్రం లోపు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఆమెపై నమోదు చేసిన సెక్షన్లన్నీ ఆరు నెలలు, మూడు సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేవే అని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. షర్మిల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది అన్నారు.
హైకోర్టు నిబంధనలను సైతం పోలీసులు పాటించడం లేదని షర్మిల తరపు న్యాయవాది వాదించారు. షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న ఒక్క వీడియోనే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, అంతకంటే ముందు చోటు చేసుకున్న వీడియోల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపారు.
అయితే, పోలీసుల తరపు న్యాయవాది వాదనలు ఇలా ఉన్నాయి. షర్మిల పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని వాదించారు. షర్మిలపై పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు ఉన్నాయని, షర్మిలకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కేసులో ఇంకా కొంతమంది సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని వాదించారు.