Nag Ashwin: 400 ఎకరాల్లో చెట్లు కొట్టేయకపోతే మంచిది - నాగ్ అశ్విన్ రిస్క్ తీసుకుంటున్నారా ?
400 acres : తెలంగాణ ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న 400 ఎకరాలపై నాగ్ అశ్విన్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. అక్కడ చెట్లు కొట్టేయకపోతే మంచిదన్నది తన అభిప్రాయమని అంటున్నారు.

Nag Ashwin comment on the 400 acres: ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తెలంగాణ ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న నాలుగు వందల ఎకరాల విషయంలో మన ఖర్మ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆ పోస్టుపై తాజాగా స్పందించారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వచ్చి పదేళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్టు దీనిపై ప్రశ్నించారు. మన ఖర్మ అని పోస్టు పెట్టి ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. దానికి నాగ్ అశ్విన్ తాను పోస్టు తీసేయాలని చెప్పారు. అయితే ఎందు కోసం పెట్టారో కడా చెప్పారు. నాలుగు వందల ఎకరాలల్లో చెట్లు కొట్టేస్తారన్న ఉద్దేశంతో తాను అలా పెట్టానని చెప్పారు.
గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం అమ్మకానికి పెట్టి కొన్ని వేల కోట్ల ఆదాయం సంపాదించుకోవాలని అనుకుంటోంది. ఈ క్రమంలో కన్సల్టెంట్లను కూడా నియమించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ల్యాండ్ విషయంలోనే నాగ్ అశ్విన్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఆ స్థలంలో పెద్ద ఎత్తున చెట్లు ఉన్నాయని గచ్చిబౌలికి లంగ్ స్పేస్ గా ఉందని దాన్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చవద్దని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఈ క్రమంలో వారి వాయిస్ కు నాగ్ అశ్విన్ కూడా జత అయినట్లుగా తెలుస్తోంది. నగరంలోని పచ్చదనాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాగ్ అశ్విన్ సూచించారు.
అవి హెచ్‌సీయూ భూములు కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఐఎంజీ భరత అనే సంస్థకు క్రీడాఅభివృద్ధి కోసం కేటాయించారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు ఓడిపోవడంతో ఆ భూములపై వివాదం ఏర్పడింది. అనేక కేసులు పడ్డాయి. చివరికి ఆ భూములు ఇటీవల అన్ని న్యాయపరమైన వివాదాల నుంచి బయటపడి ప్రభుత్వ పరం అయ్యాయి. ఆ భూములు ఒకప్పుడు శివారులో ఉన్న ఇప్పుడు నగరానికి మధ్యలో..అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ నాలుగు వందల ఎకరాలను అభివృద్ధి చేసి అమ్మితే నలభై వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే కొన్ని వర్గాలు మాత్రం ఆ భూముల్ని అలా ఉంచేయాలని అంటున్నాయి.
ప్రభుత్వం, రాజకీయ పరమైన అంశాల్లో ఇలాంటి పోస్టులు పెడితే ఇబ్బందులు ఎదురవుతాయి కదా సందేహాలను కూడా నాగ్ అశ్విన్ పట్టించుకోలేదు. అక్కడ ఉన్న చెట్లు కొట్టేయకపోతే మంచిదని చెప్పారు. నాగ్ అశ్విన్ ఎప్పుడూ రాజకీయాల జోలికి రాలేదు. అలాగని ఆయన భయపడిన సందర్భం కూడా లేదు. గతంలో కల్కి సినిమా టిక్కెట్ల విషయంలోనూ రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పుడూ అలాగే స్పందించారు. ఈ అంశంపై పర్యావరణ వేత్తలతో కలిసి తన వాదనను ఆయన నినిపించే అవకాశం ఉంది.





















