Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!
Mrs India 2022-23: మిసెస్ ఇండియా 2022 పోటీల్లో పాల్గొన్న తెలంగాణకు చెందిన కిరణ్మయి అలివేలు సత్తా చాటారు. రాజస్థాన్ వేదికగా జరిగిన పోటీల్లో ఆమె మొదటి రన్నరప్ గా నిలిచారు.
Mrs Kiranmayee Alivelu is Mrs India 2022 First Runner Up: అందాల పోటీల్లో తెలంగాణ మహిళ మరోసారి మెరిసింది. మిసెస్ ఇండియా 2022-23 పోటీల్లో పాల్గొన్న తెలంగాణకు చెందిన కిరణ్మయి అలివేలు సత్తా చాటారు. రాజస్థాన్ వేదికగా జరిగిన పోటీల్లో ఆమె మొదటి రన్నరప్ గా నిలిచారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఎంతో మంది పోటీలో పాల్గొనగా.. చివరికి 50 మంది ఫైనల్ చేరుకున్నారు. వీరికి జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 2 వరకు రాజస్థాన్ వేదికగా నిర్వహించిన మిసెస్ ఇండియా తుది పోటీల్లో తెలంగాణ ఆడపడుచు, హైదరాబాద్ కు చెందిన కిరణ్మయి చక్కని ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచారు. మిసెస్ ఇండియా విజేతల వివరాలను మంగళవారం ప్రకటించారు.
మమతా త్రివేదీకి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్
మిసెస్ ఇండియా తెలంగాణ రీజనల్ డైరెక్టర్ మిసెస్ మమతా త్రివేదీ కిరణ్మయికి మెంటర్ గా వ్యవహరించారు. వీణా పుజారి కిరణ్మయికి దుస్తులు డిజైన్ చేయగా, 10 కేటగిరీల్లో 30 మందితో పోటీపడ్డారు. టాలెంట్ రౌండ్ , డాన్స్ రౌండ్ , సఫారీ రౌండ్ తో పాటు ఫ్యాషన్ రౌండ్స్ లో గట్టిపోటీ నడిచినప్పటకీ... జడ్జీలు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానమిచ్చిన ఆకట్టుకున్నారు. ఇదే పోటీల్లో డైరెక్టర్ కేటగిరీకి సంబంధించి బెస్ట్ డైరెక్టర్ అవార్డును మమతా త్రివేదీ గెలుచుకున్నారు.
కిరణ్మయి గతంలో 2019 మిసెస్ ఇండియా తెలంగాణ ఎట్రాక్టివ్ టైటిల్ అందుకున్నారు. వివాహం తర్వాత కూడా మహిళలు కుటుంబానికే పరిమితం కాకుండా ఏదైనా సాధించొచ్చు అని రుజువు చేసే ఉధ్ధేశంతో మిసెస్ ఇండియా పోటీలకు ఆమె సిద్ధమయ్యారు. దాదాపు 8 నెలల పాటు ప్రిపేర్ అయ్యి జాతీయ పోటీలకు అర్హత సాధించారు. జాతీయ పోటీల్లో గట్టిపోటీ ఎదుర్కొన్నప్పటకీ తన అందంతో పాటు మాట్లాడే తీరు, టాలెంట్, క్రియేటివిటీ వంటి అంశాల్లో ప్రతిభ కనబరిచి రన్నరప్ గా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా ఒక తెలంగాణ మహిళ నిలవడం ఇది రెండోసారి. కాగా ఈ విజయంపై కిరణ్మయి ఆనందం వ్యక్తం చేశారు. అందాల పోటీల్లో వివాహం తర్వాత కూడా మహిళలు రాణించొచ్చు అనుకునే వారికి తాను రోల్ మోడల్ గా నిలవాలనే లక్ష్యంతోనే జాతీయ పోటీల్లో పాల్గొన్నానని కిరణ్మయి చెప్పారు. ప్రపంచాన్ని మరింత అందంగా, ఆరోగ్యంగా చూసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. తెలంగాణ నుంచి మిసెస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచిన కిరణ్మయిని పలువురు అభినందించారు.
రెండేళ్ల కిందట ఖమ్మం మహిళ..
ఖమ్మం కేంద్రంలోని పాండురంగాపురం కాలనీకి చెందిన మహమ్మద్ ఫర్హా మిసెస్ ఇండియా పోటీల్లో రెండేళ్ల కిందట తళుక్కున మెరిశారు. అహ్మదాబాద్ లో జరిగిన వీపీఆర్ మిసెస్ ఇండియా 2021 పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు. ఆ ఏడాది మొత్తం 900కు పైగా వివాహితలు అందాల పోటీలకు రిజస్టర్ చేసుకుని పోటీ పడగా ఫైనల్ కు 41 మంది చేరుకున్నారు. తెలంగాణ నుంచి ఫైనల్ చేరుకున్న ఒక్క మహిళ మహమ్మద్ ఫర్హా కాగా, ఫైనల్లో మెరుగైన ప్రదర్శనతో ఫస్ట్ రన్నరప్ తో సరిపెట్టుకున్నారు.