TG Venkatesh Reaction : టీజీ అనే ఇంటి పేరుంటే కేసు పెట్టేస్తారా? భూ కబ్జా ఘటనతో తనకేం సంబంధం లేదన్న ఎంపీ !
బంజారాహిల్స్ ల్యాండ్ వివాదంలో తనకెలాంటి సంబంధంలేదని ఎంపీ టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. టీజీ అనే ఇంటి పేరుంటే కేసు పెట్టేస్తారా అని ప్రశ్నించారు.
బంజారాహిల్స్ భూ వివాదంతో తనకెలాంటి సంబంధం లేదని ఎంపీ టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. రూ. వంద కోట్ల విలువైన భూమి విషయంలో కొంత మంది గొడవకు దిగిన ఘటనలో ఆయనపై కూడా కేసు నమోదైంది. ఈ ఘటనపై ఆయన స్పందించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు తాను లక్ష ద్వీప్‌లో ఉన్న సమయంలో భూ వివాదం గురించి తెలిసిందన్నారు. మొదట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదని.. కానీ తర్వాత రిమాండ్ రిపోర్టులో తన పేరు పెట్టారన్నారు. ఆ భూమికి తనకు ఎలాంటి సంబందం లేదని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.
బంజారాహిల్స్ భూ వివాదం విషయంలో రెండు వర్గాల మధ్య చాలా కాలంగా గొడవ నడుస్తోందన్నారు. ఈ వివాదంలో ప్రముఖంలో వినిపిస్తున్నపేరు టీజీ విశ్వప్రసాద్. ఆయన తన దూరపు బంధువని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. టీజీ అనే పేరుతో చాలా మంది బందఉవులు ఉన్నారని... అంత మాత్రాన వారు చేసే అన్ని పనుల్లో తనకు భాగస్వామ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. అలాగే టీజీ విశ్వరప్రసాద్ సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని అందులో తాను భాగస్వామిని కాదని.. టీజీ అని పేరున్నంత మాత్రాన తనకేం సంబందం ఉంటుందని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. బంజారాహిల్స్ ల్యాండ్ వివాదంతో తనకెలాంటి సంబంధం లేదని టీజీ వెంకటేష్ మరోసారి స్పష్టం చేశారు. టీజీ అనే పేరు ఉన్నంత మాత్రాన టిజి వెంకటేష్ ను వివాదంలోకి లాగడం అవివేకమని మండిపడ్డారు. మా వంశీయులు ఎందరో టిజి అనే పేరుతో కొనసాగుతున్నారని ...ల్యాండ్ వివాదానికి తనకు సంబంధం లేదని టిజి విశ్వప్రసాద్ క్లారిటీగా చెప్పారని గుర్తు చేశారు.
బంజారాహిల్స్‌లోని రోడ్ నంబరు 10లో ఏపీ జెమ్స్ అండ్ జువెలర్స్ పార్క్‌కు చెందిన స్థలం తమదేనంటూ కొందరు.. టీజీ వెంకటేశ్ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు కొద్దిరోజుల కిందట డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేశారు.దీంతో ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు గత ఆదివారం దాదాపు 10 వాహనాల్లో కర్నూల్ జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన 90 మంది మారణాయుధాలతో అక్కడకు చేరుకుని సెక్యూరిటీపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలోనే టీజీ వెంకటేశ్ పేరును బంజారాహిల్స్ పోలీసులు కేసులో చేర్చారు. ఏ-5గా టీజీ వెంకటేశ్, ఏ-1గా టీజీ విశ్వప్రసాద్‌ను పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే టీజీ వెంకటేశ్ వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చారు.