(Source: ECI/ABP News/ABP Majha)
Sabitha Indra Reddy: ప్రోటోకాల్ రగడ! నేలపైనే కూర్చొని మాజీ మంత్రి సబిత నిరసన
Hyderabad News: హైదరాబాద్‌లో ప్రోటోకాల్ రగడ చెలరేగింది. ఆలయ ఈవో తీరుతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేరుగా నిరసనకు దిగారు. నేతలపై కూర్చొని అధికారుల తీరును తప్పుబట్టారు.
Khilla Maisamma Temple: హైదరాబాద్‌లో బొనాల చెక్కుల పంపిణీ వివాదాస్పదం అయింది. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేలపై కూర్చొని నిరసన చేశారు. ఈ ప్రోటోకాల్ రగడ ఎల్బీ నగర్లోని ఖిల్లా మైసమ్మ బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చోటు చేసుకుంది. ఆర్కే పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ ఆలయం వద్ద చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇక్కడ చెక్కులు తీసుకునే వారిని మాత్రమే మీటింగ్ హాల్ లోకి అనుమతి ఉంది. ఎమ్మెల్యే వెంట వచ్చే అనుచరులకి అనుమతి లేదని పోలీసులు, ఈఓ తేల్చి చెప్పారు. దీంతో చెక్కుల పంపిణీకి వచ్చి.. స్టేజ్ వద్ద కిందనే కూర్చుని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
అయితే, ఈఓ మాత్రం కాంగ్రెస్ నేత, మహేశ్వరం కాంగ్రెస్ ఇంఛార్జి కేఎల్ఆర్ ను మాత్రం చెక్కుల పంపిణీ వేదికపైకి పిలిచారు. దీంతో అక్కడే ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఈ వ్యవహారాన్ని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా వేదిక వద్దకు రానివ్వొద్దని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రెడ్డి నిరసనకు దిగారు. అనుమతిస్తే వేదికపైకి అందర్నీ అనుమతించాలని లేకుండా.. ఆ కాంగ్రెస్ నేతను కూడా పైకి పిలవకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సబితా ఇంద్రారెడ్డి స్టేజి కింద నేలపై కూర్చొని నిరసనకు దిగారు. పోలీసులు, ఈవో తీరును తప్పుబట్టారు.
దీంతో ఖిల్లా మైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇంచార్జ్ కేఎల్ఆర్ ను చెక్కుల పంపిణీ వేదిక పైకి ఈవో ఎలా పిలుస్తారని.. అతనికి ప్రోటోకాల్ లేదు.. ఎలా పిలుస్తారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వేదిక దిగి నేలపై కూర్చుని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు నిరసనను కొనసాగించారు.
కేఎల్ఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అరగంట నుంచి పోటాపోటీగా ఈ నినాదాలు కొనసాగాయి. దీంతో పోలీసులు కలగజేసుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.